ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో కొన్ని దేశాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిఫా గుర్తించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మూడు దేశాలకు భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సెమీ ఫైనల్స్ చేరిన క్రొయేషియాతోపాటు సెర్బియా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ మూడింటిపై కలిపి లక్ష స్విస్ ఫ్రాంక్స్ (రూ.97 లక్షలపైగా) జరిమానా విధించినట్లు ఫిఫా తెలిపింది.
వీటిలో క్రొయేషియాపై అత్యధిక ఫైన్ విధించినట్లు ఫిఫా వెల్లడించింది. ఈ జట్టు అభిమానులు కెనడా గోల్ కీపర్ మిలన్ బోర్యాన్‌ను అవహేళన చేసినట్లు ఫిఫా దర్యాప్తులో తేలింది. మిలన్ తల్లిదండ్రులు క్రొయేషియాలో భాగమైన సెర్భియాకు చెందిన వారు. 1995లో క్రొయేషియా దళాలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ట్రాక్టర్లలో పారిపోయారు. ఆ విషయాన్ని సూచిస్తూ ట్రాక్టర్ ఉన్న ఒక జెండాను ఊపుతూ మిలన్‌ను క్రొయేషియా అభిమానులు ఎగతాళి చేశారు. దీంతో ఈ జట్టుపై 50 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానా విధించినట్లు ఫిఫా తెలిపింది.
బ్రెజిల్‌తో మ్యాచ్ సమయంలో సెర్బియా డ్రెస్సింగ్ రూంలో ఒక జెండా కనిపించింది. దీనిలో కొసావో ప్రాంతం కూడా సెర్బియాలో భాగంగా ఉంది. దాంతోపాటు 'మేం లొంగిపోవడం జరగదు' అనే నినాదం కూడా ఆ జెండాపై ఉంది. ఈ జెండాకు సంబంధించిన ఫొటోలను కొసావోకు చెందిన మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన ఫిఫా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. సెర్బియా జట్టుపై 20 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.
సౌదీ అరేబియా ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని చెప్పిన ఫిఫా.. అర్జెంటీనా, మెక్సికోతో జరిగిన మ్యాచుల్లో అతి చేష్టలో పోయారు. ఈ క్రమంలో అంపైర్లు వారికి హెచ్చరికలు చేశారు. ఈ మ్యాచుల్లో సౌదీ ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగలేదన్న ఫిఫా.. రెండు మ్యాచులకు కలిపి 30 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానా విధించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలను తాము ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.