ఆటగాళ్లంటే మరీ అంత చులకనా.. వాళ్ల స్థానం మరుగుదొడ్ల దగ్గరా..?

Posted By: Subhan
Aizawl FC U-15 players travel on train floor

హైదరాబాద్: ఐజ్వాల్‌కు చెందిన అండర్‌-15 ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు రైల్లో ప్రయాణిస్తున్న ఫొటో. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కారణం వారికి కనీస మర్యాద కూడా కల్పించకపోవడమే. 'ఆడేందుకు సౌకర్యాలు కల్పించక పోగా ఆటగాళ్లకు కనీస ప్రోత్సాహం కూడా లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి.' అని ఈ ఫోటో పోస్టే చేస్తూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. 'సీట్లలో కాదు టాయిలెట్లకు అతి సమీపంలో కింద కూర్చొని ప్రయాణిస్తున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల దుస్థితి ఇది' అని ఇంకొందరు జాలి చూపిస్తున్నారు.

అసలు కథ ఇలా.. :
నైక్‌ ప్రీమియర్‌ కప్‌ కోసం ఐజ్వాల్‌ అండర్‌-15 ఆటగాళ్లు గోవా వెళ్లారు. సెమీఫైనల్లో ఐజ్వాల్‌ జట్టు మినిర్వా చేతిలో ఓటమి చవిచూడటంతో ఐజ్వాల్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఆటగాళ్లు తిరుగు పయనమయ్యారు. గోవా-కోల్‌కతా-గువాహటికి వీరు రైల్లో వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గోవా నుంచి కోల్‌కతా అయితే బాగానే వచ్చారు.

కానీ, అక్కడి నుంచి గౌహతి వెళ్లేందుకు ఎక్కిన రైల్లో ఆటగాళ్లకు సీట్లు దొరకలేదు. లీగ్‌లో ఆడి అలిసిపోయిన ఆటగాళ్లు నిల్చునే ఓపిక లేక వారు బోగీల్లో కిందే కూర్చున్నారు. వారి పరిస్థితిని చూసిన ప్రయాణికులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

ఏం జరిగిందో నాకు తెలియదు:
ఐజ్వాల్‌ ఎఫ్‌సీ క్లబ్‌ అధ్యక్షుడు రాబర్ట్‌ దృష్టికి ఆటగాళ్ల సమస్య వెళ్లింది. 'ఆటగాళ్ల ప్రయాణం ఇలా సాగిందని నాకు తెలియదు. టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో ఆటగాళ్లు అప్పటికప్పుడు తిరుగుపయనమయ్యారు. టీసీ సీట్ల సర్దుబాటు కోసం అరగంట వేచి ఉండమన్నాడు. ఆ తర్వాత ఏసీ బోగీల్లో ఆటగాళ్లకు సీట్లు దక్కాయి. ఈ విరామంలో ఇది జరిగి ఉండొచ్చు. లీగ్‌లో విజేతగా నిలిస్తే తిరుగు ప్రయాణంలో విమాన టిక్కెట్లు బుక్‌ చేస్తామని కూడా చెప్పాను'అని రాబర్ట్‌ తెలిపారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయ్యో! ఆటగాళ్లకు ఎంత కష్టమొచ్చిందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 14:42 [IST]
Other articles published on Feb 13, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి