IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సులోనే సంచలనాలు సృష్టించిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్లకే అండర్-19 ప్రపంచకప్ గెలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఈ యువ ఆటగాడిని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హెచ్చరించారు.
రాబిన్ ఉతప్ప ఏమన్నారంటే?
ఓ కార్యక్రమంలో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. "గత 12 నెలలుగా వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను నేను గమనిస్తున్నాను. వైభవ్ అద్భుతమైన టాలెంట్ కలవాడు. దానిని కాదనలేం. కానీ వైభవ్ బ్యాటింగ్ శైలిని చూస్తుంటే.. అతను తన అదృష్టాన్ని నమ్ముకుని ఆడుతున్నాడని అనిపిస్తోంది. గతేడాది అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సీజన్ అతనికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది. వైభవ్ కచ్చితంగా పరుగులు సాధిస్తాడు. కానీ గతేడాదిలాగా ఈ సారికి అతడికి అంత సులభంగా ఉండదు" అని రాబిన్ ఉతప్ప కుండబద్ధలు కొట్టారు.

వైభవ్ సూర్యవంశీ రికార్డులు
రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలోనే తన ముద్ర వేశాడు. తన ఐపీఎల్ కెరీర్ మొదటి బంతినే సిక్సర్‌గా మలచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. 2025 సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌లలోనే 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసి, 200 పైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఏకైక ఆటగాడు అతనే.
రాజస్థాన్ రాయల్స్ కొత్త ఉత్సాహం
త్వరలో 15 ఏళ్ల వయస్సులోకి రానున్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ వైదొలిగిన తర్వాత రియాన్ పరాగ్ సారథ్యంలో కొత్తి శక్తిని పుంజుకున్న రాజస్థాన్ రాయల్స్.. రవీంద్ర జడేజా రాకతో మరింత బలంగా మారింది. చిన్నవయస్సులోనే స్టార్‌డమ్ పొందిన వైభవ్ సూర్యవంశీ.. తన దూకుడును కొనసాగిస్తుడా లేదా పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకుంటాడా అనేది ఈ ఐపీఎల్ సీజన్లో చూడాలి.