భారత క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బౌలర్ యశ్ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎటువంటి హడావిడి లేకుండా సీక్రెట్‌గా యశ్ దయాల్ వివాహం చేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్ మనసు గెలుచుకున్న యశ్ దయాల్.. ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
గుట్టుచప్పుడు కాకుండా వివాహం
గత నెలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. యశ్ దయాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్కడా షేర్ చేయకపోవడం గమనార్హం. అయితే శ్వేతా పుంఢీర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో యశ్‌తో మద్దతుగా పోస్టులు పెడుతూనే ఉంది.

వివాదాల నుంచి ఉపశమనం
వివాహానికి ముందు యశ్ దయాల్ కొన్ని వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ దయాల్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో యశ్ దయాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు యశ్ దయాల్ శ్వేతతో కలిసి ఏడడుగులు వేశాడు.
ఐపీఎల్‌లో సంచలనం
యశ్ దయాల్ పేరు వినగానే 2023 ఐపీఎల్‌లో రింకూ సింగ్ చేతిలో పడ్డ ఐదు సిక్సర్లు గుర్తుకు వస్తాయి. ఆ మ్యాచ్ తర్వాత తీవ్ర నిరాశకు గురైన యశ్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రిలీజ్ చేసింది. కానీ ఆర్సీబీ యశ్ దయాల్‌పై నమ్మకం ఉంచి 2024లో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో యశ్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు బౌలింగ్ విభాగంలో ప్రధాన సభ్యుడిగా మారాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కారణంగానే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఆయనను రిటైన్ చేసుకుంది. వరుస విజయాలు, ఇప్పుడు పెళ్లి.. ఇలా యశ్ దయాల్ కెరీర్, వ్యక్తిగత జీవితం ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాయి.