"ది హండ్రెడ్" 2026 టోర్నమెంట్ వేలంలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఏకంగా సుమారు రూ.2.34 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన ఈ జట్టు.. ఓ పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం క్రీడా ప్రపంచంలో చర్చకు దారితీసింది. అయితే ఈ కొనుగోలు జరిగినప్పటి నుంచి భారీగా వ్యతిరేకత రావడమే కాకుండా ఇప్పుడు అబ్రార్ అహ్మద్ టోర్నీలో ఆడటంపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎందుకు ఆడకపోవచ్చు?
అబ్రార్ అహ్మద్ ఈ లీగ్‌లో ఆడటంపై సందిగ్ధతకు ప్రధాన కారణం షెడ్యూల్ తేదీలు. పాకిస్థాన్ జాతీయ జట్టు జులై 15 నుంచి ఆగస్టు 7 వరకు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు 'ది హండ్రెడ్' టోర్నీ జులై 21న ప్రారంభమై ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. అంటే టోర్నీ జరిగే సమయంలోనే పాకిస్థాన్ జట్టు అంతర్జాతీయ పర్యటనలో ఉండటంతో అబ్రార్ అహ్మద్ తన దేశం తరఫున ఆడాల్సి ఉంటుంది. దీనివల్ల అబ్రార్ అహ్మద్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) లభించడం కష్టమని తెలుస్తోంది.

పీసీబీ నిర్ణయం కీలకమే!
అబ్రార్ అహ్మద్ పాకిస్థాన్ టెస్ట్ జట్టు ప్రధాన స్పిన్నర్ కాకపోయినప్పటికీ.. అతనికి ఎన్వోసీ ఇవ్వాలా లేదా అన్నది పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల్లోనే ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. జాతీయ జట్టుకు అవసరమైన ఆటగాళ్లకు ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వడం కష్టమని సమాచారం. అబ్రార్ అహ్మద్ ఈ టోర్నీలో ఆడటం అనేది 50-50 అవకాశాలుగానే ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సన్‌రైజర్స్ లీడ్స్ వ్యూహం
సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియర్ వెట్టోరి మాట్లాడుతూ.. తాము ఆదిల్ రషీద్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయమని.. నాణ్యమైన స్పిన్నర్ అవసరంతోనే అబ్రార్ అహ్మద్‌ను వేలంలో దక్కించుకున్నామని వెల్లడించారు. అబ్రార్ వంటి మిస్టరీ స్పిన్నర్ జట్టులో ఉంటే అది పెద్ద బలంగా మారుతుందని వారు భావిస్తున్నారు. కానీ పీసీబీ అనుమతి రాకపోతే సన్‌రైజర్స్ తమ కీలకమైన ఈ అంతర్జాతీయ ఆటగాడిని కోల్పోయే అవకాశం ఉంది.