
4 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసిన నరేన్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 4 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్రిస్ లిన్ (22) ఫర్వాలేదనిపించగా, రాబిన్ ఉతప్ప (29) దూకుడుగా ఆడే క్రమంలో రనౌటయ్యాడు.

సగం ఓవర్లయ్యేసరికే కష్టాల్లో కోల్‌కతా
ఆ తర్వాత నితీశ్ రాణా (16), రింకూ సింగ్ (2) ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ చేరారు. సగం ఓవర్లయ్యేసరికే సగం వికెట్లు కోల్పోయిన కోల్‌కతా కష్టాల్లో పడింది. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ దినేష్ కార్తీక్ (26), ఆండ్రీ రసెల్ (88) తీసుకున్నారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ నిలకడగా ఆడగా... రసెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

27 బంతుల వ్యవధిలో 10 సిక్సులు
కేవలం 36 బంతులు ఎదుర్కొని ఒక్క బౌండరీ, 11 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. కేవలం 27 బంతుల వ్యవధిలో పది సిక్సర్లు బాదాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించుకోవచ్చు. రసెల్ మొత్తం 11 సిక్సర్లు బాదితే అందులో ఆరు బ్రావో బౌలింగ్‌లో కొట్టినవే. ముఖ్యంగా మిడ్‌వికెట్ వైపు రసెల్ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు.

14వ ఓవర్లో తొలి సిక్సర్ బాదిన రసెల్
తొలి 11 బంతుల్లో 10 పరుగులే చేసిన రసెల్.. బ్రావో వేసిన 14వ ఓవర్లో తొలి సిక్సర్ బాది దూకుడు ప్రారంభించాడు. ఆ తర్వాత శార్దూల్ వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మళ్లీ బ్రావో బౌలింగ్‌కు రాగా.. ఆ ఓవర్లో రసెల్ కొట్టిన ఓ బంతి మిడాన్‌లో 105 మీటర్లు ప్రయాణించి స్టేడియం అవతలపడింది.

బ్రావో వేసిన 19వ ఓవర్లో మూడు బంతులకు మూడు సిక్సర్లు
అదే ఓవర్లో రసెల్ మరో సిక్సర్, కార్తీక్ కూడా ఒక సిక్సర్ కొట్టడంతో 19 పరుగలొచ్చాయి. బ్రావోనే వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు బంతులకు మూడు సిక్సర్లు బాదిన రసెల్.. 73 పరుగులకు చేరుకున్నాడు. ఇంకా 9 బంతులుండటంతో అతను సెంచరీ బాదేస్తాడేమో అనిపించింది. అయితే చివరి ఓవర్లో రసెల్ మూడు బంతులే ఆడాడు. అందులో రెండు సిక్సర్లు బాదాడు.

20 బంతుల్లో 68 పరుగులు చేసిన రసెల్
ఒకానోక దశలో 16 బంతులకు 20 పరుగులు చేసిన రసెల్.. తర్వాతి 20 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. షేన్ వాట్సన్ ( 42) వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ లైన్ దాటించడంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

టోర్నీలో రెండో విజయం నమోదు చేసిన చెన్నై
అతనికి జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన అంబటి రాయుడు (39) ఫర్వాలేదనిపించాడు. రైనా (14), ధోనీ ( 25) విఫలమైనప్పటికీ ఆ ప్రభావం ఇన్సింగ్స్ పై పడకుండా శామ్ బిల్లింగ్స్ (56) ధాటిగా ఆడాడు. కీలక దశలో అతను ఔటైనప్పటికీ రవీంద్ర జడేజా చివరి ఓవర్‌లో రాణించి, జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.


Click it and Unblock the Notifications
