
హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు ఆ దేశ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది. వాస్తవానికి, శ్రీలంక ఈ ఏడాది అక్టోబర్‌లో టెస్టు సిరిస్ ఆడాలి. ఆ తర్వాత మళ్లీ డిసెంబరులో వైట్ బాల్ క్రికెట్ కోసం తిరిగి రావాల్సి ఉంది.
టెస్ట్ వేదికలను నిర్ణయించే ముందు పరిస్థితిని అంచనా వేయడానికి గాను ఈ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చడం జరిగింది. కాగా, పాక్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రొగ్రామ్‌లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లంక బోర్డు వెల్లడించింది.
2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా పాక్ పర్యటనకు వెళ్లేందుకు సాహాసించలేదు. ఇటీవలే శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం పాక్‌లో పర్యటించింది. ఈ పర్యటనకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు దూరమైనప్పటికీ ద్వితీయ శ్రేణి జట్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
టెస్టు మ్యాచ్ షెడ్యూల్:
11-15 December 1st Test, Pindi Cricket Stadium, Rawalpindi
19-23 December 2nd Test, National Stadium, Karachi