షమీ కేసు విషయంలో బీసీసీఐని సంప్రదించిన కోల్‌కత్తా పోలీసులు

Posted By:
Kolkata police ask BCCI for Mohammed Shami's South Africa tour details

హైదరాబాద్: తీవ్రతరమవుతోన్న షమీ కేసుపై పోలీసులు సైతం విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అతని భార్య ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల ప్రకారం.. అతనిపై పలు కేసులు నమోదు చేసిన కోల్‌కత్తా పోలీసులు విచారణలో భాగంగా బీసీసీఐని సంప్రదించారు. షమీ దక్షిణాఫ్రికా పర్యటన వివరాలు అందజేయాలని వారు క్రికెట్ బోర్డును కోరారు.

జనవరి నుంచి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రయాణ వివరాలు అందజేయాలని కోరుతూ మంగళవారం కోల్‌కత్తా పోలీసులు బీసీసీఐకి లేఖ పంపారు. ఈ పర్యటనకు భారత జట్టు డిసెంబర్ నెలాఖర్లోనే భారత్ నుంచి బయల్దేరింది. ఆ పర్యటన మొత్తం షమీ జట్టుతోనే ఉన్నాడా? లేదంటే ఎక్కడికైనా వెళ్లాడా అనే వివరాలు అందజేయాలని పోలీసులు కోరుతూ లేఖను రాశారు.

అదేగాక, అతను తిరుగు ప్రయాణంలో భారత జట్టుతో పాటుగా వచ్చేశాడా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే అతని భార్య ఇచ్చిన ఫిర్యాదులో అతను అందరితో పాటు తిరుగు ప్రయాణం కాకుండా దుబాయ్‌లోనే ఉండి అక్కడ పాకిస్థాన్ మహిళతో గడిపాడంటూ ఆరోపించింది. సరిగ్గా అతను ఫిబ్రవరి 18న అక్కడ హోటల్‌లో పాకిస్థానీ మహిళతో గడిపాడనే నమ్మకాన్ని అతడి భార్య హసీన్ జహాన్ వ్యక్తం చేశారు.

అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఆడిన షమీ మిగతా ఆటగాళ్లతోపాటే సఫారీ గడ్డ నుంచి తిరిగి ప్రయాణమయ్యాడా? లేదంటే దుబాయ్‌లో గడిపి.. సొంత ఖర్చులతో భారత్ వచ్చాడా అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు కోల్‌కత్తా పోలీసులు.

Story first published: Monday, March 12, 2018, 15:52 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి