గాయంతో జులన్ దూరం: టీ20 సిరిస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ

Posted By:
Jhulan Goswami ruled out of T20I series against South Africa

హైదరాబాద్: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరిస్‌కు ముందు భారత మహిళల జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి టీ20 సిరిస్ నుంచి తప్పుకుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన ఆఖరి వన్డేలో జులన్ గోస్వామి గాయపడిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ మిథాలీ కాదు, కౌర్: టీ20 సిరిస్‌పై కన్నేసిన భారత్

దీంతో సోమవారం ఆమెకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీయగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తిరిగి భారత్‌కు పయనమైంది. ఈ మేరకు బీసీసీఐ మంగవారం ఉదయం ఓ ప్రకటన చేసింది. 'కాలి గాయంతో బాధపడుతోన్న జులన్‌ గోస్వామికి సోమవారం ఎమ్మారై స్కాన్‌ నిర్వహించాం. గాయం తీవ్రమైందని తేల్చి చెప్పిన వైద్యులు రెండు వారాలు విశ్రాంతి సూచించారు. దీంతో ఆమె దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి తప్పించాం' అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

భారత్‌కు చేరుకున్న తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి రిహాబిలిటేషన్‌కు వెళ్లేముందు ఫుట్ స్పెషలిస్ట్‌ను సంప్రదించనుంది. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. భారత్‌కు చేరుకున్న తర్వాత గోస్వామి జాతీయ క్రికెట్ అకాడమీలోని రిహాబిలేషన్ సెంట‌ర్‌కు వెళ్లనుంది. ఇటీవలే వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జులన్ గోస్వామి అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌‌లో భాగంగా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జులన్ ఈ రికార్డు నెలకొల్పింది. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఓపెనర్ లూరా (9) వికెట్‌ని తీసిన జులన్ కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకుంది.

తన 166వ వన్డేలోనే జులన్ గోస్వామి ఈ ఘనత సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు టి20పై కన్నేసింది. ఐదు టి20ల సిరీస్‌‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మంగళవారం ఆరంభం కానుంది.

తొలి రెండు వన్డేల్లో సఫారీలపై మిథాలీసేన పూర్తి ఆధిక్యం కనబర్చిన సంగతి తెలిసిందే. అయితే టీ20ల్లో కొత్త కెప్టెన్‌ ఆధ్వర్యంలో భారత మహిళల జట్టు తలపడుతోంది. డాషింగ్‌ బ్యాట్స్‌ ఉమన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలో టీ20 ఫార్మాట్‌లోనూ తమ ఆధిపత్యం చాటాలని భావిస్తోంది.

వన్డే సిరీస్‌లో సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్‌ ఉమన్‌ స్మృతి మందాన వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ టీ20 సిరిస్‌లో 17 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ ఆకర్షణగా నిలవనుంది. భారత క్రీడాకారిణుల్లో స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉన్నారు.

భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో తొలి రెండు టీ20 మ్యాచ్‌లను క్రికెట్ దక్షిణాఫ్రికా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, చివరి మూడు మ్యాచ్‌లను టెలివిజన్‌లో ప్రసారం కానున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, February 13, 2018, 12:14 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి