ఢిల్లీపై యువరాజ్ మెరుపులు: ట్విట్టర్‌లో ఏవరేమన్నారు

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగుతోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

యువరాజ్ సింగ్ (41బంతుల్లో 70 నాటౌట్;11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. తనకు అందివచ్చిన లైఫ్‌ని యువరాజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.

Fans hail Yuvraj Singh for his incredible batting against Delhi

క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో యువీ ఇచ్చిన క్యాచ్‌ను సంజూ శాంసన్ వదిలేయడంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత యువరాజ్ తనదైన షాట్లతో అలరించాడు. సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30; 21 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్),శిఖర్ ధావన్(28;17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌(24 బంతుల్లో 24)తో కలిసి ధావన్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డుని పరుగులెత్తించాడు.

పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసిన సన్ రైజర్స్.. 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో మూడో వికెట్‌గా విలియమ్సన్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ముందు ఎటువంటి భారీ షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకునే యత్నించారు. ఆ క్రమంలోనే యువరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను ఢిల్లీ ఫీల్డర్ సంజూ శాంసన్ జారవిడిచారు. ఈ సమయంలో యువరాజ్ స్కోరు 30 పరుగులు. ఆ తర్వాత యువీ మరింత వేగంగా ఆడి సన్ రైజర్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

టీ20ల్లో యువరాజ్‌కి ఇది 25వ అర్ధ సెంచరీ. దీంతో యువరాజ్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Tuesday, May 2, 2017, 23:47 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి