
కౌంటీ టీంతో ఇలా ఆడితే మరీ.. మెయిన్ టీంతో ఎలా?
ఒక కౌంటీ టీంతో ఇంటర్నేషనల్ టీం అయిన ఇండియా ఇలా ఆడితే.. ఇంగ్లాండ్ లాంటి దుర్భేద్యమైన టీంతో ఏపాటి పోటీ ఇవ్వగలరనే సందేహాలు వ్యక్తమయ్యేలా భారత బ్యాటింగ్ కొనసాగింది. ఎప్పటిలాగే టెయిలెండర్ల అండతో బతికి బట్టకట్టింది కానీ.. లేకుంటే 150కే ఆలౌట్ అయ్యేది. ఇక ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ ఒక్కడే మొండిగా నిలబడ్డంతో స్కోరు కాస్త ముందుకు కదిలింది.

లంచ్ టైంకే అయిదుగురు పెవిలియన్‌కు
భారత్-లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ మధ్య లీసెస్టర్ స్టేడియంలో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ నిరాశపరిచారు. తమ చెత్త బ్యాటింగ్‌తో పేలవ ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు లంచ్ టైంకే పెవిలియన్‌కు చేరుకున్నారు. కేవలం 81పరుగులకే 5వికెట్లు పడిపోయాయి. రోహిత్ శర్మ (25), శుభ్ మాన్ గిల్ (21), హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యార్ (0) రవీంద్రా జడేజా (13)పూర్తిగా నిరాశపరిచారు. ఇక లంచ్ టైంకు భారత జట్టు అయిదు వికెట్ల నష్టానికి 90పరుగులు చేసింది.

కాసేపు కోహ్లీ, భరత్ కలిసి..
ఇక భారత్ పతనాన్ని కాసేపు విరాట్ కోహ్లీ (33పరుగులు 69బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్), వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ (70పరుగులు 111బంతుల్లో 8ఫోర్లు 1 సిక్సర్ నాటౌట్) అడ్డుకున్నారు. వీరిద్దరు 6వికెట్‌కు 57పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కుదురుకున్నట్లు కన్పించిన విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ఇక భారత్ 150, 160అయినా చేస్తుందా అనే డౌట్లు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే శార్దూల్ ఠాకూర్ (6) వచ్చీ రాగానే ఔటవ్వడంతో 148పరుగులకే 7వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర కష్టాల్లో పడింది.

టెయిలెండర్లే మెయిన్ బ్యాటర్లుగా..
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఉమేష్ యాదవ్ (23పరుగులు 32బంతుల్లో 4ఫోర్లు) గట్టి పోరాట పటిమ కనబరిచాడు. కేఎస్ భరత్, ఉమేష్ యాదవ్ జోడీ 8వ వికెట్‌కు 66పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో స్కోరు రెండొందలు దాటింది. తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ (18పరుగులు 26బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) సైతం పోరాట పటిమ కనబర్చుతున్నాడు. ఈ క్రమంలో వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ ఆగిపోయింది. 60.2 ఓవర్లకు భారత్ స్కోరు 8వికెట్లు కోల్పోయి 246పరుగులకు చేరుకుంది.

రేపు భరత్ సెంచరీ చేస్తాడా.. లేక?
ఇంకా దాదాపు 25 నుంచి 30 ఓవర్ల ఆట ఉన్నప్పటికీ వర్షం వల్ల ఆట సాధ్యం కాలేదు. ఇక రేపు కేఎస్ భరత్ సెంచరీ చేస్తాడా.. లేక అంతలోనే టీమిండియా ఆలౌట్ అవుతుందా అనేది చూడాలి. ఇక ఈ మ్యాచ్‌లో లీసెస్టర్ షైర్ తరఫున ఆడుతున్ భారత్ బౌలర్లలో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రసీద్ క్రిష్ణ మాత్రం 1వికెట్ తీశాడు. అతను శ్రేయస్ అయ్యార్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో లీసెస్టర్ షైర్ బౌలర్ రోమన్ వాకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 5వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బ తీశాడు.