సిడ్నీ: భారీ పరాజయం మూట గట్టుకుని పరువు పోగొట్టుకున్న టీమిండియాకు మరో దెబ్బ తగిలింది. శుక్రవారం సిడ్నీలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం చొప్పున కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శనివారం ప్రకటించింది. బౌలింగ్ చేయడానికి కేటాయించిన సమయం కంటే.. ఎక్కువ సమయం తీసుకున్నందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది ఐసీసీ.
కెప్టెన్ విరాట్ కోహ్లీ తన తప్పును ఒప్పుకున్నాడని. దీనిపై అధికారికంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీమిండియా నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఒక టీమ్ తక్కువగా వేసే ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టయినా.. 210 నిమిషాల్లో 50 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పెనాల్టీ విధిస్తారు. సిడ్నీ వన్డేలో వెసులుబాటు కల్పించిన సమయం ముగిసిన తర్వాత భారత్ ఒక ఓవర్ వేసినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా 50 ఓవర్లు వేయడానికి భారత్ 246 నిమిషాలు తీసుకుందని సమాచారం. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టు ఒక ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను కోల్పోతుంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌పై అలవోక విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 105; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆరోన్ ఫించ్ (124 బంతుల్లో 114; 9ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో భారత్ 8 వికెట్లకు 308 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 90; 7ఫోర్లు, 4సిక్స్‌లు), శిఖర్ ధావన్ (86 బంతుల్లో 74; 10ఫోర్లు) పోరాడినా మిగిలిన వారు విఫలమయ్యారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం సిడ్నీ వేదికగా జరగనుంది.
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. కేఎల్ రాహుల్‌ను క్షమించమని కోరా: మాక్స్వెల్