
చెలరేగిన ఓపెనర్లు..
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101), శుభ్‌మన్ గిల్(78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 112) సెంచరీలతో చెలరేగడంతో తొలి వికెట్‌కు 212 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. దాంతో టీమిండియా 400 ప్లస్ పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్, శుభ్‌మన్ ఔటైన వెంటనే భారత ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తత్తరపాటు టీమిండియా మిడిలార్డర్ వైఫల్యానికి కారణమైంది. ఓపెనర్ల అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఇషాన్ కిషన్‌తో కలిసి తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు.

ఇషాన్ తత్తరపాటు..
ఇక ఆరంభంలో తెగ ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్.. సాంట్నర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చాడు. కానీ ఇదే క్రమంలో లేని పరుగు కోసం
ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. జకోబ్ డఫ్పీ వేసిన 35వ ఓవర్ మూడో బంతిని కవర్స్ వైపు షాట్ ఆడిన ఇషాన్ కిషన్ క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి పిలుపు నిచ్చాడు. వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తే విరాట్ కోహ్లీ, బంతి ఎటు వెళ్లిందో కూడా గమనించకుండా సింగిల్ కోసం పరుగెత్తాడు.

పరుగు కోసం పిలుపునిచ్చి..
అయితే సగం క్రీజు ధాటిన తర్వాత ఔట్ అవుతానని గ్రహించిన ఇషాన్ కిషన్ యూటర్న్ తీసుకున్నాడు. దాంతో ఇద్దరూ బ్యాటర్లు ఒకేవైపు పరుగెత్తడంతో న్యూజిలాండ్ ఫీల్డర్ల పని సులువైంది. విరాట్ కోహ్లీ కోసం తన వికెట్ త్యాగం చేసి ఇషాన్ పెవిలియన్ వైపు నడవగా.. అంపైర్లు ఎవరు ముందు వచ్చారనేది చెక్ చేశారు. కోహ్లీనే ముందుగా క్రీజులో ఉండటంతో ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించారు. పెవిలియన్‌కి వెళ్లే సమయంలో ఇషాన్ కిషన్.. విరాట్ కోహ్లీని ఏదో అనడం కూడా కెమెరాల్లో కనిపించింది..
— Saddam Ali (SaddamAli7786) January 24, 2023 |
ఇషాన్ కిషన్ ఔటవ్వకుంటే..
ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చే సమయానికి ఇంకా 22 ఓవర్లకు పైగా ఆట మిగిలే ఉంది. కాస్త కుదురుకుంటే సెంచరీలు చేయడం, ఓ భారీ ఇన్నింగ్స్ ఆడడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అనవసరంగా తొందరపడి ఇషాన్ కిషన్ వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్, సూర్య, సుందర్ కూడా ఔటవ్వడంతో భారత్ సాధారణ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ శార్దూల్ ఠాకూర్ సాయంతో హార్దిక్ పాండ్యా కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో భారీ స్కోర్ చేసింది.