
కోహ్లీ కెరీర్ నాశనం చేసేందుకు యత్నం?
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చాలా తప్పులు చేసిందని చెప్పిన కనేరియా.. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కెరీర్ నాశనం చేసేందుకు ఆ బృందం ప్రయత్నించిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. 'కోహ్లీ ఫామ్‌లో లేక తంటాలు పడుతున్నప్పుడు అతనికి మద్దతివ్వాల్సింది పోయి.. కొన్ని సిరీసుల్లో మాత్రమే ఆడిస్తూ అతని కెరీర్ నాశనం చేసేందుకు ప్రయత్నించారు. దానికితోడు కెప్టెన్సీ నుంచి అబద్ధాలు చెప్పి కోహ్లీని తొలగించారు కూడా' అని చెప్పాడు.

కెప్టెన్సీ వివాదం..
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో వేరు వేరు కెప్టెన్‌లు వద్దనుకున్న సెలెక్షన్ కమిటీ మాట మాత్రం చెప్పకుండా అతన్ని వన్డే సారధ్యం నుంచి తప్పించింది.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన కనేరియా.. 'కోహ్లీని కెప్టెన్సీ నుంచి ఎలా తొలగించారో అందరికీ తెలుసు. అతనే తనతో మాటమాత్రం చెప్పలేదని వెల్లడించాడు' అన్నాడు. ఇలా కోహ్లీని నాశనం చేసేందుకు సెలెక్షన్ కమిటీ ప్రయత్నించిందని, కానీ కోహ్లీ మాత్రం అన్నింటినీ అధిగమించి తన సత్తా నిరూపించుకున్నాడని కొనియాడాడు.

వరుసగా కెప్టెన్లు..
చేతన్ శర్మ బృందం చేసిన మరో పెద్ద పొరపాటు వరుస పెట్టి కెప్టెన్లను మార్చడం అని అందరూ అంటున్నారు. కనేరియా కూడా ఇదే మాటన్నాడు. 'వరుసగా కెప్టెన్లు మార్చేయడంతోపాటు చాలా మంది అర్హులైన ఆటగాళ్లకు చేతన్ శర్మ కమిటీ సరైన అవకాశాలు కూడా ఇవ్వలేదు. ఇలా జట్టులో మరీ ఎక్కువగా మార్పులు చేయడంతో చాలా మంది ఆటగాళ్లు.. జట్టులో ఎక్కువ కాలం ఉండలేకపోయారు' అని వివరించాడు.

విలువైన వారైతే బెటర్
సెలెక్షన్ కమిటీలో మాజీ ప్లేయర్లు ఉండటం సబబే అన్ని కనేరియా.. కానీ తమ కెరీర్‌లో ఏదైనా సాధించిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు. చేతన్ శర్మ క్రికెట్ కెరీర్ చాలా నిరాశాజనకంగా ఉందని, కాబట్టి ఎవరైన విలువైన వారికి ఈ అవకాశం దక్కితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. చేతన్ శర్మ కమిటీ సెలెక్షన్ చాలా ప్రశ్నలు లేవనెత్తిందని విమర్శించాడు. మరి కొత్త సెలెక్షన్ కమిటీలో ఎవరు చేరతారో చూడాలి.