వీడియో వైరల్: 4వ వన్డేలో సఫారీ స్పిన్నర్‌పై జాత్యాహంకార దాడి

Posted By:
Chennai Super Kings (CSK) player racially abused in South Africa-India ODI (Video)

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ప్రధాన స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌‌పై మరోసారి జాత్యాహంకార దాడి జరిగింది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా జోహెన్స్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో వన్డే జరుగుతోన్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే స్టేడియంలో మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమాని తాహిర్‌పై జాత్యాంహకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడితో కాసేపు వాగ్వాదానికి దిగిన ఈ స్పిన్నర్ స్టేడియంలోని భద్రతా సిబ్బందికి సమాచారం అందించాడు.

దీంతో వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించి స్టేడియం వెలుపలికి పంపించేశారు. ఇమ్రాన్ తాహిర్‌పై ఆ అభిమాని తిడుతూ దాడి చేసినట్లు వాట్సప్ గ్రూపుల్లో వార్తలు రావడంతో ఈ ఘటనను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది. అంతేకాదు ఈ ఘటనపై అధికారిక ప్రకటన కూడా చేసింది.

'శనివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌పై స్టేడియంలో ఒక వ్యక్తి జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనపై తాహిర్ ఫిర్యాదు చేయడంతో భద్రతా సిబ్బంది వెంటనే నిందితుడ్ని అనంతరం వెలుపలికి పంపించేశారు. స్పిన్నర్‌పై ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. ఈ ఘటనపై దక్షిణాఫ్రికా బోర్డు, సెక్యూరిటీ టీమ్స్ విచారణ జరుపుతున్నాయి' అని బోర్డు అందులో పేర్కొంది.

పాకిస్థాన్ సంతతి వ్యక్తి అయిన ఇమ్రాన్ తాహిర్‌కి 2015 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇమ్రాన్ తాహిర్ దక్షిణాఫ్రికా తరుపున 20 టెస్టులు, 84 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతోన్న ఆరు వన్డేల సిరిస్‌లో తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

నాలుగో వన్డేలో తాహిర్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. ఇక, బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఇమ్రాన్ తాహిర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా ఇమ్రాన్ తాహిర్ ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఇటీవలే తన తమిళ టీచర్‌తో దిగిన ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, February 12, 2018, 17:34 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి