కోట్లలో మోసపోయారు: ద్రవిడ్, సైనాలకు బెంగళూరు కంపెనీ టోకరా

Posted By:
Bengaluru based company duped Rahul Dravid for crores

హైదరాబాద్: బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేయడంతో పలువురు సెలబ్రిటీలు మోసపోయారు. సంస్థ మోసం చేసిన బాధితుల్లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ లెజెండ ప్రకాశ్ పదుకొణె, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, మాజీ కర్ణాటక క్రికెటర్ అవినాష్ వైద్య తదితరులు ఉన్నారు.

విక్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే కంపెనీ చేసిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమారు 1,776 మందిని మోసం చేసి 300 కోట్లకు పైగా వారి నుంచి పెట్టుబడులు సేకరించి నిధులు స్వాహా చేసిన‌ట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆటలు, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసం జరిగిందని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ క్రికెటర్ ద్రవిడ్, అతని కుటుంబం కలిసి మొత్తం రూ.35 కోట్లను విక్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. కానీ, వాళ్లు తిరిగి కేవలం రూ.20 కోట్లను మాత్రమే పొందగలిగారు. గత ఆరేళ్ల నుంచి ద్రవిడ్ ఒక్కడే రూ.20 కోట్లను అందులో పెట్టుబడి పెట్టగా, తాను వ్యక్తిగతంగా పెట్టిన మొత్తం నుంచి కేవలం రూ.12 కోట్లను మాత్రమే కంపెనీ చెల్లించింది.

మరోవైపు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం ఈ సంస్థలో రూ.1.5 కోట్లను పెట్టుబడిగా పెట్టగా రూ.75 లక్షలను కంపెనీ చెల్లించింది. మాజీ క్రికెటర్ అవినాష్ వైద్య కూడా తన డబ్బును సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో ఉన్నాడు. వీరితో పాటు సినిమా, స్పోర్ట్స్, రాజకీయ నాయకులు, కామర్స్ రంగాల్లోని పలువురు ప్రముఖులు ఈ సంస్థలో భారీ ఎత్తును ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు.

వీళ్లతో సహా సాధారణ ప్రజలను కూడా ఈ కెంపెనీ మోసం చేసింది. ఈ మోసానికి పాల్పడిన కంపెనీ యాజమాని రాఘవేంద్ర శ్రీనాథ్‌తో పాటు ఏజెంట్లు సుత్రం సురేశ్, నరసింహామూర్తి, కేసీ నాగరాజ్, ప్రహ్లాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది.

ఈ కంపెనీ యాజమాని రాఘవేంద్ర శ్రీనాథ్‌ ఓ ఇంజనీర్. అతడి మాస్టర్ మైండ్‌తో వీరందని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ విశేషం ఏంటంటే సుత్రం సురేశ్ బెంగళూరులో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్. తనకు పరిచయం ఉన్న క్రీడాకారులతో ఈ మోసపూరిత కంపెనీలో పెట్టుబడి పెట్టేలా వారిని నమ్మించడంలో కీలకపాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు.

Story first published: Wednesday, March 14, 2018, 12:46 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి