
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయాలంటూ తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు.
ఈ మేరకు అంబటి రాయుడు తన ట్విట్టర్‌లో "కేటీఆర్ సర్... హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించండి. హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్‌సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్‌సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు" అని ట్వీట్ చేశాడు.
గతంలోనూ హెచ్‌సీఏలో వందల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబటి రాయుడు తాను వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవలే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.