ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్ పసికూన. అయితే ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా చెప్పాడు. కొన్ని రోజుల క్రితం టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే పరిస్థితులు అనుకూలించడంతో ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఇదే విషయం చెప్పిన చోప్రా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచులు చాలా ఉత్కంఠగా జరుగుతాయని, కానీ రికార్డులు మాత్రం వేరే ఫలితాలు చూపిస్తాయని అన్నాడు.
'బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని చూస్తే సమవుజ్జీల సమరంలా కనిపిస్తుంది. రెండు జట్లు హోరా హోరీగా తలపడతాయి. కానీ ఫలితాలను గమనిస్తే వేరే కథ కనిపిస్తుంది. కానీ బంగ్లాదేశ్ చేతిలో మాత్రం ఓడిపోకూడదు. ఇది గ్యారంటీ' అని ఆకాష్ చోప్రా అన్నాడు. బంగ్లా జట్టు బలహీనమైంది కాదన్న చోప్రా.. 'తమీమ్ ఇక్బాల్ ఒక మంచి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్, కెప్టెన్, ఓపెనర్ కూడా. షాంటో కూడా నిలకడగా ఆడతాడు. లిటన్ దాస్ నా ఫేవరెట్. అతను క్రీజులో కుదురుకుంటే సెంచరీ చేస్తాడు' అని చోప్రా వివరించాడు.
ఈ ఫార్మాట్‌లో బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్‌ఫికర్ రహీం ఇంకా ఆడుతున్నాడని గుర్తు చేసిన చోప్రా.. అతను జట్టులో ఉంటే కచ్చితంగా ఆడతాడన్నాడు. అలాగే షకీబల్ హసన్ ఆటతీరుకు కూడా ఈ ఫార్మట్ చక్కగా సరిపోతుందని చెప్పాడు. బంగ్లా బౌలింగ్ గురించి ప్రస్తావించిన చోప్రా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాదత్ హుస్సేన్, నాసుమ్ అహ్మద్‌తో వాళ్ల బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉందన్నాడు. ఈ జట్టు ఎవరినైనా ఇబ్బంది పెడుతుందని, ఏమాత్రం తడబడినా ఏ జట్టునైనా ఓడించగలదని తేల్చి చెప్పాడు. కాబట్టి బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయకూడదని వార్నింగ్ ఇచ్చాడు.