సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి సూపర్ 500 టైటిల్ సొంతం చేసుకుంది. సింగపూర్ ఓపెన్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-9, 11-21, 21-15తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి(చైనా)పై గెలుపొందింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోఆడిన ఏకైక మ్యాచ్‌లో వాంగ్ జియిని ఓడించిన సింధు.. తాజా మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది.
పవర్‌పుల్ స్మాష్‌లతో తొలి గేమ్‌ను అలవోకగా గెలిచిన సింధుకు రెండో గేమ్‌లో ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. వాంగ్ జి యి ఆధిపత్యం చెలాయించడంతో సింధు షటిల్‌ను సరిగ్గా కంట్రోల్ చేయలేక వరుసగా తప్పిదాలు చేసింది. ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన వాంగ్.. 3-0, 6-1, 11-3తో ఆధిక్యాన్ని పెంచుకుంటూ సింధుకు అవకాశం లేకుండా చేసింది. ఇక ఫోర్ హ్యాండ్ షాట్‌తో 21-11తో వాంగ్ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది.
దాంతో డిసైడర్ మూడో గేమ్ ఆడాల్సిర రాగా.. సింధు తన తప్పిదాల నుంచి తేరుకుంది. ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో స్కోర్లు 4-4 సమంగా వచ్చాయి. ఈపరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సాధించిన సింధు 8-5తో లీడ్‌లో నిలిచింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైన వాంగ్.. వరుస తప్పిదాలు చేసింది. 12-10తో పుంజుకున్నా.. సింధు ఆధిక్యం తగ్గకుండా చెలరేగింది. చివరకు తనదైన స్మాష్‌లతో 21-15తో గేమ్‌తో పాటు టైటిల్‌ను అందుకుంది.
ఈ ఏడాది సింధు గెలిచిన మూడో టైటిల్ ఇది. ఈ టోర్నీకి ముందు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్స్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్స్ సింధు సొంతం చేసుకుంది.