పరుగుల రాణి పీటీ ఉష కీలక పదవి చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు ఐఓఏ అధ్యక్షురాలిగా మహిళలు ఎన్నడూ లేరు. వచ్చే నెల 10న జరిగే ఎన్నికల్లో ఉషను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐఓఏ చరిత్రలో అది ఒక కీలక మైలురాయిగా మారుతుంది.
అంతేకాదు, ఈ పదవిలో మహరాజా యాదవీంద్ర సింగ్ (1934) తర్వాత కూర్చునే క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం గమనార్హం. యాదవీంద్ర సింగ్ మాజీ క్రికెటర్ కాగా.. పీటీ ఉష స్ప్రింటర్. భారత లెజెండరీ స్ప్రింటర్ అయిన 58 ఏళ్ల ఉష తన కెరీర్‌లో ఒక క్రీడా సంస్థ అధ్యక్షురాలిగా సేవలు అందించడం ఇదే తొలిసారి. 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుతంగా రాణించిన ఆమె.. సెకనులో వందో వంతు తేడాతో నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకుంది. అయితే 1983, 1985 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలతో మెరిసింది.
చిట్టచివరగా 1998లో జపాన్ వేదికగా జరిగిన ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించింది. ఇటీవల ఐఓఏ ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసిన 8 మంది అత్యుత్తమ భారత అథ్లెట్ల జాబితాలో ఉష కూడా ఒకరు కావడం గమనార్హం. వచ్చే నెలలో జరిగే ఐఓఏ అధ్యక్ష ఎన్నికల్లో ఉష నామినేషన్ వేయగా.. ఆమెతోపాటు ఉపాధ్యక్ష పదవికి ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్, సీనియర్ ఉపాధ్యక్ష పదవికి అజయ్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఆయా పదవులకు వీళ్లు తప్ప మరెవరూ నామినేషన్ వేయలేదు. అంటే ఈ ఎన్నికల్లో ఈ క్రీడాకారుల విజయం లాంఛనమే. అంటే ఐఓఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్నమాట.