వార్నర్ పట్ల దురుసుగా: రబాడ దూకుడుపై ఐసీసీ మరోసారి కొరడా

Posted By:
South Africa Vs Australia, 2nd Test: Rabada steers Proteas to series-levelling win but set for ban

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సఫారీలు విజయం సాధించడంతో ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ కీలకపాత్ర పోషించాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ భుజాన్ని తాకి విమర్శలు ఎదుర్కొన్న రబాడ.. రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ ఔటైన సమయంలో కాస్తంత దూకుడని ప్రదర్శించాడు.

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా 2018 2nd టెస్టు స్కోరు కార్డు

ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు తప్పులు చేసి నాలుగు డీమెరిట్ పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న రబాడపై రానున్న రెండు మ్యాచ్‌ల వేటు పడింది. అయినా సరే రబాడ తన పద్దతిని మాత్రం మార్చుకోలేదు. రెండో టెస్ట్ మ్యాచ్‌ మూడో రోజులో ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన తర్వాత వార్నర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన రబాడపై ఐసీసీ మరోసారి కొరడా ఝులిపించింది.

వార్నర్ వికెట్ తర్వాత రబాడ చాలా దరుసుగా ప్రవర్తించాడు. దీంతో రబాడ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఇందుకు రబాడ ఇంకా అంగీకరించలేదని పేర్కొంది. కాగా, రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన రబాడ మొత్తం 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యా‌చ్‌ల సిరిస్ 1-1తో సమం అయింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 101 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మర్క్రమ్ (21), డీన్ ఎల్గర్ (5) పరుగులకే పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హషీమ్‌ ఆమ్లా(27), డివిలియర్స్‌(28), డిబ్రన్‌(15 నాటౌట్‌) పరుగులతో రాణించారు. 180/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజైన సోమవారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 59 పరుగులకే మిగితా ఐదు వికెట్లను కోల్పోయింది.

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఆసీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రబాడకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 22 (గురువారం) కేప్ టౌన్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, March 12, 2018, 19:55 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి