5వ వన్డేలో భారత్ విజయం: సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

Posted By:
Rohit Sharma

హైదరాబాద్: సఫారీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది.

దీంతో సపారీ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరిస్‌ను గెలిచిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో డుమిని(2), డివిలియర్స్(6) దారుణంగా విఫలమయ్యారు. ఆమ్లా (72) ఒంటరిపోరాటం చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు.

కెప్టెన్‌ మార్క్రమ్ (32), మిల్లర్‌ (36), క్లాసెన్‌ (39) పరుగులతో ఫరవాలేదనిపించారు. నాలుగో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ఫెహలుక్వాయో డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లు మరోసారి సత్తా చాటారు. కుల్దీప్‌ 4 వికెట్లు పడగొట్టగా, చాహల్‌ 2, పాండ్యా2 వికెట్లు తీశాడు.

బుమ్రాకు ఒక వికెట్‌ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున సూపర్‌ సెంచరీ (115 పరుగులు) చేసిన రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌ వేదికగా జరుగనుంది.


సపారీల ఇన్నింగ్స్ సాగిందిలా:

దూకుడుగా ఆడుతున్న క్లాసెన్
ఐదో వన్డే ఆసక్తికరంగా మారింది. 275 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు 40 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేశారు. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 83 పరుగులు చేయాలి. వికెట్ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (37) దూకుడుగా ఆడుతున్నాడు.


ఆమ్లాని రనౌట్ చేసిన పాండ్యా
275 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (71) ఔటయ్యాడు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన 34.3వ బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా నాన్‌ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను తాకేలా అద్భుతంగా బంతిని విసిరి ఆమ్లాని రనౌట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్‌ వేసిన 35.3వ బంతికి ఫెలుక్‌వాయో (0) బౌల్డయ్యాడు. 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం క్లాసెన్‌ (15), రబాడ (0) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే 84 బంతుల్లో 107 పరుగులు చేయాలి.


ఆమ్లా హాఫ్ సెంచరీ
టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో ఆమ్లాకి ఇది 35వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను సఫారీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా (50), క్లాసెన్ (2) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతున్న మిల్లర్
టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (32) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (34) అతడికి సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరి కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.


మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ సఫారీలు
భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా లక్ష్య చేధనలో తడబడింది. భారత్ నిర్దేశించిన టార్గెట్‌ని చేరుకొనే క్రమంలో ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే బుమ్రా వేసిన 10 ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ మార్క్రమ్ (32) క్యాచ్ ఔటయ్యాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో డుమినీ(1) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. అనంతరం కీలక ఆటగాడు డివిలియర్స్‌(6)కు పాండ్య బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో ఆమ్లా(26), మిల్లర్(14) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సఫారీల విజయానికి ఇంకా 201 పరుగులు చేయాల్సి ఉంది.


సఫారీల విజయ లక్ష్యం 275

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దీంతో సఫారీ జట్టుకు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (115; 126 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో రాణించాడు.

ఈ సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో విఫలమైన రోహిత్ శర్మ ఐదో వన్డేలో మాత్రం చెలరేగాడు. ఇక, శిఖర్‌ ధావన్‌ (34), విరాట్‌ కోహ్లీ (26), శ్రేయీస్‌ అయ్యర్‌ (30) ఫరవాలేదనిపించారు. చివరి 10 ఓవర్లలో పరుగులు రాబట్టడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడ 4 వికెట్లు తీయగా, రబాడకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో ఎంగిడి (4/51) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత్ ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్ ఎంగిడి వేసిన 43వ ఓవర్‌లో రోహిత్ శర్మ(115) కీపర్ క్లాసెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా(0) కూడా కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఎంగిడి వేసిన 44వ ఓవర్ 2 బంతి శ్రేయాస్ అయ్యర్ కూడా కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. క్రీజులో ధోని(1), భువనేశ్వర్(1) పరుగులతో ఉన్నారు.


రోహిత్ శర్మ సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 107 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్‌ శర్మకి ఇది 17వ సెంచరీ. శిఖర్ ధావన్ 34, విరాట్ కోహ్లీ 36 (రనౌట్), అజింక్యా రహానె 8 (రనౌట్) వెనుదిరగగా రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. 36 ఓవర్లకుగాను 3 వికెట్లు కోల్పోయిన భారత్ 203 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 101, శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడాకి ఒక వికెట్ దక్కింది.


మూడో వికెట్ కోల్పోయిన భారత్
పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 176 పరుగుల వద్ద మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో రహానే (8) రనౌటయ్యాడు. భారత్ ఇప్పటి వరకు మూడు వికెట్లు కోల్పోగా అందులో రెండు రనౌట్లే కావడం విశేషం రహానే ఔటైన తర్వాత క్రీజులోకి యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. ప్రస్తుతం 32 ఓవర్లకు గాను భారత్ 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (90), అయ్యర్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.


కోహ్లీ రనౌట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు ఎట్టకేలకు సఫలమయ్యారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీల జోడిని విడదీశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 152 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే మోర్కెల్ వేసిన 26వ ఓవర్‌లో 3వ బంతికి పరుగు కోసం తొందరపడి కోహ్లీ రనౌట్ అయ్యాడు. కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ రనౌట్‌తో ముగింపుపడటం ఇది ఏడోసారి. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్(79), రహానే(2) ఉన్నారు.


25 ఓవర్లకు భారత్ 148/1
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో టీమిండియా 25 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (34) ఔటైన తర్వాత రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ అతడికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు.


ఎట్టకేలకు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 35వ హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఈ సిరిస్‌లో జరిగిన నాలుగు వన్డేల్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్ శర్మ ఐదో వన్డేలో మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ఆరంభం నుంచీ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు. మరో ఎండ్‌లో అతడికి విరాట్‌ కోహ్లీ (23) సహకారం అందిస్తున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 114 పరుగులు చేసింది.


డ్రింక్స్ విరామానికి భారత్ 99/1
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా డ్రింక్స్ విరామానికి అంటే 17 ఓవర్లకు వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (39), విరాట్ కోహ్లీ (20) పరుగులతో ఉన్నారు.


15 ఓవర్లకు భారత్ 90/1
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ధావన్ (34) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. రోహిత్ శర్మ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ సఫారీ ఫాస్ట్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (16) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన భారత్
పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు దూకుడుగా ఆడారు. గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సులు బాదుతూ.. స్కోర్‌బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. రబాడ వేసిన ఇన్నింగ్స్ 7.2 ఓవర్ రెండో బంతికి శిఖర్ ధావన్ (34) వద్ద ఫెలుక్‌వాయేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.


5 ఓవర్లకు భారత్ 17/0

పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో భారత ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. దీంతో 5 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ (12), రోహిత్ శర్మ (5) పరుగులతో ఉన్నారు.


కోహ్లీసేన బ్యాటింగ్
ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో వన్డే ప్రారంభమైంది. పోర్ట్‌ ఎలిజబెత్‌‌లోని సెయింట్ జార్జి పార్క్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదో వన్డేలో కోహ్లీసేన ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. సఫారీ జట్టులో ఒక మార్పు చేశారు. క్రిస్‌ మోరిస్‌ స్థానంలో షంసీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.

ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై సిరీస్‌ గెలిచిన భారత తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అలా జరగని పక్షంలో సిరిస్ ఫలితం ఆరో వన్డేకు మారుతుంది. దీంతో చివరి వన్డేలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ స్టేడియంలో భారత్‌ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

1992 నుంచి ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయలేకపోయింది. ఇక, సఫారీల విషయానికి వస్తే ఇక్కడ 32 మ్యాచ్‌లు ఆడగా 11 మాత్రమే ఓటమిపాలైంది.

ఈ పర్యటనలో ధోని మరో రెండు మైలురాళ్లకు అడుగు దూరంలో నిలిచాడు. అందులో ఒకటి పదివేల పరుగులు చేయడానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని 9,954 వన్డే పరుగులతో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీని సాధిస్తే, పదివేల పరుగుల మైలురాయిని ధోని అందుకుంటాడు.

రెండో మైలురాయి ఏంటంటే, వన్డేల్లో ఇప్పటి వరకు ధోని 295 క్యాచ్‌లను పట్టాడు. మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు పట్టిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధిస్తాడు. పోర్ట్‌ ఎలిజబెత్‌ స్పిన్నర్ల స్వర్గధామం. ఇక్కడ ఆతిథ్య జట్టు ఆడిన చివరి రెండు వన్డేల్లో స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు.

జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా: అయిడెన్‌ మార్ర్కమ్‌, హషీమ్‌ ఆమ్లా, జేపీ డుమిని, ఏబీ డివిలియర్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అండిలె ఫెలుక్‌వాయో, రబాడ, లుంగి ఎంగిడి, మోర్నీ మోర్కెల్‌, తబ్రైజ్‌ షంషీ

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Match starts at: 4:30 pm IST
Live on: Sony TEN 1, Sony TEN 1 HD

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 16:13 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి