ముంబై: ఇంకొద్దిరోజుల్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్ మ్యాచ్. ఇదివరకు భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది.
దీనికంటే ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల ఈ వార్మప్ మ్యాచ్ ఇవ్వాళే ప్రారంభం కానుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీని పేరు ఫాక్సెస్ యూట్యూబ్ ఛానల్.
లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్ జట్టులో నలుగురు టీమిండియా క్రికెటర్లను తీసుకున్నారు. చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.. లీసెస్టర్‌షైర్ క్లబ్ తరఫున ఆడబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే- టీమిండియా ప్లేయర్లు జస్‌ప్రీత్ బుమ్రా యార్కర్లను రుచి చూడబోతున్నారన్నమాట.
ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యాన్ని వహించనున్నాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ తుదిజట్టు కోసం ఎంపికయ్యారు. సామ్ ఇవాన్స్ కేప్టెన్సీలో లీసెస్టర్‌షైర్ టీమిండియాను ఎదుర్కొనబోతోంది. రేహాన్ అహ్మద్, సామ్ బేట్స్ (వికెట్ కీపర్), నాట్ బౌలే, విల్ డేవిస్, జోయ్ ఎవిసన్, లూయిస్ కింబర్, అబి సకండే, రోమన్ వాకర్, చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికయ్యారు.