బంగ్లాదేశ్‌పై ఘన విజయం: నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా

Posted By:
India vs Bangladesh 5th T20I Highlights : India Entered Nidahas Trophy Final
Rohit Sharma

హైదరాబాద్: నిదాహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తాజా విజయంతో టీమిండియా ముక్కోణపు సిరిస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్పికర్‌ రహీమ్‌ (55 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ లిటన్ దాస్(7), సౌమ్యా సర్కార్(1), తమీమ్ ఇక్బాల్(27)లను స్వల్ప స్కోర్‌కే పెవిలియన్‌కు చేర్చాడు.

ఆ తర్వాత కెప్టెన్ మహ్మదుల్లా(11) చాహల్ బౌలింగ్‌లో ఔట్ కాగా, ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టును ముష్పికర్‌ రహీమ్ ఆదుకున్నాడు. షబ్బీర్ రహ్మన్‌(27)తో కలిసి ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో రహీమ్‌ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో సిరాజ్‌ భారీగా పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే 19 ఓవర్‌లో శార్ధుల్‌ కట్టిడి చేయడంతో భారత్‌ విజయం సాధించింది. భారత బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్, శార్థూల్, చాహాల్ తలో వికెట్ తీశారు.


సుందర్ దెబ్బకి కుప్పకూలిన బంగ్లాదేశ్ టాపార్డర్

నిదాహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ చావుదెబ్బ కొట్టడంతో 6 ఓవర్లకు 48 పరుగులు చేసి 3 వికెట్లు చేజార్చుకుంది.

సుందర్ బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్(7) స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సౌమ్యా సర్కార్(1) సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కీలక ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(27) మళ్లీ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో రహీమ్(9), మహ్మదుల్లా(8) ఉన్నారు.


బంగ్లా విజయ లక్ష్యం 177

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 177 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సిరీస్‌ ఆరంభం నుంచి వరుసగా విఫలమవుతూ పెవిలియన్‌ బాట పట్టిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత ఓపెనర్లు నిలకడగా ఆడారు. ఓపెనర్ శిఖర్ ధావన్(35) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన సురేష్ రైనాతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టీ20ల్లో 13వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆరంభంలో నిలకడగానే బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ చివర్లో దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది. రుబెల్ వేసిన 20 ఓవర్ మొదటి బంతికి రైనా(47) సౌమ్య సర్కార్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అదే ఓవర్ చివరి బంతికి రోహిత్(87) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుబెల్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.


తొలి వికెట్ కోల్పోయిన భారత్: 10 ఓవర్లకు భారత్ 71/1
ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (35) పరుగుల వద్ద రూబెల్ హాసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సురేశ్ రైనా (1), రోహిత్ శర్మ (33) పరుగులతో ఉన్నారు.


నిలకడగా ఆడుతోన్న భారత ఓపెనర్లు

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. పవర్ ప్లే ముగిసింది. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. ఈ టోర్నమెంట్‌లో ఇదే భారత ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం కావడం మరో విశేషం. ప్రస్తుతం రోహిత్ శర్మ(29), ధావన్(32) పరుగులతో క్రీజులో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌
ముక్కోణపు సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య కొలంబో వేదికగా టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌ స్సినర్లకు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. జయదేవ్‌ ఉనాద్కత్‌ స్థానంలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం లభించింది.

India vs Bangladesh 2018 Match 5 Score Card

ఇక బంగ్లాదేశ్‌ జట్టులో టస్కిన్‌ స్థానంలో అబూ హైదర్‌ను తీసుకున్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి టైటిల్ పోరుకు చేరువైంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా పైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం ఫైనల్‌ బెర్తు కోసం బంగ్లా-శ్రీలంక చివరి లీగ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. మరోవైపు మ్యాచ్‌ నెట్‌రన్‌ రేట్‌ కూడా కీలకం అవుతుంది.

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్

బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), తమీమ్, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, రెహమాన్, హక్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, టస్కిన్, జాయేద్, రూబెల్ హుస్సేన్, నజ్ముల్ ఇస్లామ్.

Story first published: Wednesday, March 14, 2018, 18:40 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి