బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాల్సిందే.. : సీఓఏ

Posted By:
CoA asks court to conduct fresh BCCI elections

హైదరాబాద్: ఇక ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటోంది సీఓఏ. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి బీసీసీఐ అధికారులకు మధ్య వైరం ముదురుతోంది. పదవీ కాలం ముగిసిన బోర్డు పాలక సభ్యులను వెంటనే తొలగించాలని సీఓఏ కోరింది. అంతేగాక, బీసీసీఐ ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

మరోవైపు తమను సంప్రదించకుండానే ఆటగాళ్ల వార్షిక ఒప్పందాలపై సీఓఏ నిర్ణయం తీసుకుందని, వాటిపై సంతకాలు చేసే ప్రసక్తే లేదంటున్నాడు బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై నియమితమైన సీఓఏ గురువారం సుప్రీం కోర్టుకు ఏడో ప్రగతి నివేదికను సమర్పించింది.

బీసీసీఐ నియమావళి ప్రకారం.. తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లాల పదవీ కాలం ఇప్పటికే ముగిసిపోయిందని వివరించింది సీఓఏ. వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీలతో కూడిన పాలకుల కమిటీని మార్చాలని తన నివేదికలో కోర్టుకు తెలిపింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

లోధా సిఫార్సుల ప్రకారం కొత్త నియమావళి ఇంకా అమల్లోకి రాకపోయినప్పటికీ.. వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించే అవకాశమివ్వాలని కోర్టును కోరింది. మరోవైపు భారత క్రికెటర్లకు కొత్తగా వార్షిక ఒప్పందాలు ఇచ్చిన తీరును బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తప్పు పట్టాడు. బోర్డు పాలక సభ్యులను సంప్రదించకుండానే ఒప్పందాలపై సీఓఏ తుది నిర్ణయం తీసుకుందని ఆరోపించాడు. ఒప్పంద పత్రాలపై తాను సంతకం చేయనని చెప్పాడు.

ఐతే సీఓఏ సభ్యురాలు డయానా ఎడూల్జీ అమితాబ్‌ ఆరోపణలను కొట్టిపారేసింది. పాలక సభ్యులకు మూడుసార్లు సమాచారం అందించినా ఎవరూ అందుబాటులోకి రాలేదని.. బీసీసీఐ ఫైనాన్స్‌ కమిటీ కొత్త కాంట్రాక్ట్‌లపై చర్చించిందని వివరించింది.

Story first published: Friday, March 9, 2018, 9:23 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి