మార్క్రమ్ సెంచరీ: ఆసీస్ కొత్తగా ఆరంభం, దక్షిణాఫ్రికా 313/6

Posted By:
Australia fight back late after Markram, De Villiers prop up South Africa

హైదరాబాద్: జోహెన్స్ బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్‌ మార్క్రమ్ (216 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌తో 151) సెంచరీతో రాణించగా, ఏబీ డివిల్లీర్స్‌ (119 బంతు ల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఆరు వికెట్లకు 313 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బవుమా (25), డికాక్‌ (7) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీన్ ఎల్గర్ (19), విఫలమైనా మార్క్రామ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఆమ్లా (27)తో రెండో వికెట్‌కు 89, డివిలియర్స్ (67)తో కలిసి మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. నిషేధానికి గురైన ముగ్గురి స్థానంలో బర్న్స్, రెన్‌షా, హ్యాండ్స్‌కోంబ్‌ బరిలో దిగారు. ఒక దశలో 247/2తో పటిష్టంగా కనిపించిన సఫారీలు 52 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు మూడు, తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతోన్న సేయర్స్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇదిలా ఉంటే బాల్ టాంపరింగ్ వివాదం అనంతరం జరుగుతోన్న తొలి టెస్టు కావడం, ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ వ్యవహారించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లందరితో ఆసీస్‌ క్రికెటర్లు వరుసగా కరచాలనం చేశారు. సాధారణంగా మ్యాచ్‌ ముగిశాక కనిపించే ఇలాంటి దృశ్యం మ్యాచ్‌కు ముందు కనిపించడం ఇదే తొలిసారి. మ్యాచ్ ప్రారంభానికి ముందు టిమ్‌ పైన్‌ ఈ విధంగా చేద్దామని డుప్లెసిస్‌ని అడగ్గా అందుకు అంగీకరించాడు.

అనంతరం పైన్ మాట్లాడుతూ ఇది ప్రతీ సారి కొనసాగుతుందని చెప్పలేకపోయినా... తాను కొత్తగా మొదలు పెట్టాలనుకున్నట్లు పైన్‌ వెల్లడించాడు. పరోక్షంగా 'మరక' తర్వాత మళ్లీ కొత్తగా ఆరంభం చేస్తున్నట్లు పైన్ చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1తో ఇప్పటికే దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 7:34 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి