ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్
భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతోనే రెండో టీ20లో ఓటమిపాలయ్యామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు. ముఖ్యంగా ఇషాన్, తిలక్ ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. తమ జట్టు ఫీల్డింగ్ బాలేదని, కానీ ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా భారత్‌దేనని ప్రశంసించాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇషాన్, తిలక్ బ్యాటింగ్ అమోఘం..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికిందర్ రజా.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తన బ్యాటింగ్ వైఫల్యం కూడా జట్టుకు భారంగా మారిందని అంగీకరించాడు. 'మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారు ఆడిన కొన్ని షాట్లు అమోఘం. ఈ రోజు వారు చూపిన నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం. మేం ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. ఫీల్డింగ్ మెరుగ్గా చేసి బౌలర్లకు అండగా నిలిచి ఉంటే వారు ప్రత్యర్థిపై మరింత అదనపు ఒత్తిడి తీసుకొచ్చేవారు. కానీ ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా భారత బ్యాటర్లదే.

ఈ రోజు వారు కనబర్చిన ప్రదర్శన నుంచి మేం చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇషాన్ చాలా అద్భుతంగా ఆడాడు. నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇషాన్ కిషన్‌తో పాటు తిలక్ వర్మ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వారి చూపించిన బ్యాటింగ్ నైపుణ్యం నుంచి మేం చాలా నేర్చుకోవచ్చు. మేం మెరుగుపడటానికి బాగా సహాయపడుతుంది.
నా బ్యాటింగ్ కూడా
220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశాం. మా ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దురదృష్టవశాత్తు.. అనుభవరాహిత్యంతో సరైన షాట్లను ఎంపిక చేసుకోలేకపోయాం. అన్నింటికన్నా ముఖ్యంగా.. కెప్టెన్‌గా నా పేలవ బ్యాటింగ్‌తో నేను జట్టుకు భారంగా మారాను. జట్టు కోసం నేను బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. దురదృష్టవశాత్తు.. గత రెండు టీ20ల్లో నేను రాణించలేకపోయాను. ఆ అల్లా దయతో పరిస్థితిని చక్కదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే జట్టుకు నేను పరుగులు చేయడం చాలా అవసరం.'అని సికిందర్ రజా పేర్కొన్నాడు.
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.
అనంతరం జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ(3/17) మూడు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్(2/30), ప్రిన్స్ యాదవ్(2/10) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ తలో వికెట్ తీసారు. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆదివారం హరారే వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


