సంజూ శాంసన్‌కు బుడ్డోడి బుగులు
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌లో అభద్రతా భావం నెలకొందని వెటరన్ బ్యాటర్ హనుమ విహారి అన్నాడు. దాంతోనే వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడని చెప్పుకొచ్చాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కారణంగానే సంజూ శాంసన్ ఇన్‌సెక్యూరిటీకి గురవుతున్నాడని విహారి అభిప్రాయపడ్డాడు.
సంజూ శాంసన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ చాలా కాలంగా అవకాశాలు ఇస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అతనిపై ఉందన్నాడు. జట్టులో పోటీ పెరగడంతోనే శాంసన్ ఒత్తిడికి లోనవుతున్నాడని చెప్పుకొచ్చాడు.
వరుసగా 4 మ్యాచ్‌ల్లో విఫలం..
వెస్టిండీస్‌తో గత మంగళవారం జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ 11 పరుగులే చేసి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. జపాన్‌తో ఏకైక టీ20లో 9 పరుగులే చేసిన సంజూ.. ఆసియా గేమ్స్‌లో వరుసగా 7, 2 పరుగులతో నిరాశపర్చాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో అతన్ని పక్కనపెట్టి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత సంజూ కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. అవి కూడా గత నెలలో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో సాధించాడు.

బుడ్డోడి బుగులు..
సంజూ శాంసన్ బ్యాటింగ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హనుమ విహారి.. అనవసర ఒత్తిడే అతని వైఫల్యానికి కారణమని చెప్పాడు. గతంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చినప్పుడు కూడా సంజూ ఇలానే ఒత్తిడికి గురై వరుస మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని గుర్తు చేశాడు.
' సంజూ శాంసన్‌కు ఇంకా ఎన్నాళ్లు అవకాశాలు ఇస్తారు? నేను కూడా అతని అభిమానినే. అతను బాగా ఆడాలని కోరుకుంటాను. కానీ జట్టులో పోటీ పెరగడంతో సంజూ శాంసన్ అభద్రతకు గురవుతున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు కూడా సంజూ శాంసన్ ఇలానే ఒత్తిడికి గురయ్యాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రెడీగా ఉండటంతో ఆ ఒత్తిడి మరింత పెరిగినట్లు అనిపిస్తుంది.
ఒత్తిడిని తట్టుకునే దమ్ముండాలి..
భారత్ తరఫున ఆడేటప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం చాలా ముఖ్యం. ఆ పరిస్థితిని ఎదుర్కొన్న ఆటగాళ్లకే దాని తీవ్రత అర్థమవుతుంది. సంజూ శాంసన్ మాత్రమే కాదు.. అతని స్థానంలో ఎవరున్నా అలాంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.'అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 43 బంతుల్లోనే 102 నాటౌట్‌గా) అజేయ శతకంతో సత్తా చాటడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఇషాన్ కిషన్ 37 పరుగులతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలోనే ఛేదించింది. రెండో టీ20 శుక్రవారం రాంచీ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
" width="200" height="113">
