Asian Games 2026: తెలుగు సైన్యం ఇదే!
ఆసియా గేమ్స్ 2026 అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ 20వ ఆసియా గేమ్స్‌కు జపాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. నగోయా నగరంలో శనివారం అదిరిపోయే రీతిలో ఆరంభ వేడుకలు జరిగాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 45 దేశాల క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 30కి పైగా క్రీడల్లో 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
ఈ ఆసియా క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు క్రీడాకారులు కూడా సిద్ధమయ్యారు. ఎన్నో కలలతో బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్, అథ్లెటిక్స్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, ఈ-స్పోర్ట్స్‌లో పతకాలు సాధించేందుకు జపాన్ గడ్డపై అడుగుపెట్టారు. పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, ఇషా సింగ్, జ్యోతి సురేఖ, జ్యోతి యర్రాజి, తిలక్ వర్మ తదితరులు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగుతున్నారు.

క్రికెట్
హైదరాబాద్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ.. రెండో సారి ఆసియా గేమ్స్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ సారి భారత జట్టుకు అతను వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. మహిళల జట్టు తరఫున కడప రెడ్డమ్మ శ్రీచరణి, హైదరాబాద్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటికే భారత్ సెమీఫైనల్ చేరగా.. శ్రీచరణి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చింది. క్రికెట్‌లో భారత్ అలవోకగా రెండు స్వర్ణాలు గెలవనుంది.
బ్యాడ్మింటన్
హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సిందు సింగిల్స్‌తో పాటు టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతోంది. ఆదివారం నుంచి టీమ్ ఈవెంట్ పోటీలు మొదలవ్వనుండగా.. ఈనెల 25వ తేదీ నుంచి సింగిల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్, టీమ్ ఈవెంట్‌లో, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్‌లో ఆడుతుండగా.. కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి కేవలం టీమ్ ఈవెంట్‌లోనే పోటీ పడుతున్నారు.
ఆర్చరీ
విజయవాడ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవ్వగా.. పెద్దపల్లి యువ ఆర్చర్ తానిపర్తి చికితరావు కాంపౌండ్ వ్యక్తిగత, మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్‌లో పోటీపడుతోంది. విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌ల్లో బరిలోకి దిగుతున్నాడు. రాజమండ్రికి చెందిన గణేష్ మణిరత్నం కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో పోటీపడుతున్నాడు. ఆర్చరీలో భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉంది.
అథ్లెటిక్స్
చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో సిల్వర్ నెగ్గిన యర్రాజి జ్యోతి మరో పతకంపై కన్నేసింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో ఈ విశాఖ అమ్మాయి బరిలోకి దిగనుంది. కర్నూలుకు చెందిన 19 ఏళ్ల మొగిలి వెంకట్రామ్ రెడ్డి 800 మీటర్ల పరుగులో అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
షూటింగ్
గత ఆసియా క్రీడల్లో నాలుగు రజతాలు సాధించి సంచలనం సృష్టించిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ మరోసారి పతకాల పంట పండించేందుకు రెడీ అయ్యింది. ఇషా సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో బరిలోకి దిగుతుంది. కైనాన్ షెనాయ్ ట్రాప్, మిక్స్‌డ్ స్కీట్ విభాగాల్లో పోటీ పడనున్నాడు.
టేబుల్ టెన్నిస్
కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్, హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ సింగిల్స్, డబుల్స్, టీమ్ ఈవెంట్‌ల్లో బరిలోకి దిగుతుంది.
ఈ-స్పోర్ట్స్
ఈ-స్పోర్ట్స్‌లో భారత్ నుంచి 15 మంది పోటీ పడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయికృష్ణ నల్లూరి పోకీమాన్ యునైట్ ఈవెంట్‌లో పోటీపడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


