శ్రేయస్ అయ్యర్ ఆటగాళ్ల కెప్టెన్.. టీమిండియాను ఏలుతాడు: వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రేయస్ అయ్యర్ ఆటగాళ్ల కెప్టెన్ అని కొనియాడాడు. ప్రతీ ఆటగాడిని సౌకర్యంగా ఉంచుతూ.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే సామర్థ్యం అయ్యర్‌కు ఉందని తెలిపాడు. కెప్టెన్‌గా అతనికి మంచి భవిష్యత్తు ఉందని, ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు.
ఆసియా గేమ్స్ 2026లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా తాత్కలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ సేవలు అందించాడు. తాజాగా ఆసియా గేమ్స్ విజయంపై మాట్లాడిన లక్ష్మణ్.. అయ్యర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాళ్ల కెప్టెన్..
'టీమ్ మీటింగ్స్‌కు ముందే శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై కసరత్తు చేస్తాడు. ఫిట్‌నెస్‌కు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. టీ20ల్లో ప్రత్యర్థి కంటే ఒకటి, రెండు అడుగులు ముందుండేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాడు. శ్రేయస్‌ను ఆటగాళ్ల కెప్టెన్ అని పిలవాలి.

జట్టులోని ప్రతి ఆటగాడి సామర్థ్యాన్నిఅతను బాగా అర్థం చేసుకుంటాడు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడంలో అతను చాలా చురుకుగా వ్యవహరిస్తాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ ముందుండి జట్టును నడిపిస్తాడు. చాలా తెలివైన అయ్యర్.. కెప్టెన్‌గా ఉజ్వల భవిష్యత్తు ఉంది.
మా ఆటగాళ్లు బంగారం..
జపాన్‌లో ప్రతికూల వాతావరణం, ప్రయాణ సమస్యలు, సాధనకు తక్కువ సమయం ఉన్నా మా ఆటగాళ్లు అద్భుతంగా సర్దుకుపోయారు. కఠిన పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో ఆడటం నన్ను బాగా ఆకట్టుకుంది. భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవ లేదు.'అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
ఉత్కంఠగా సాగిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61), తిలక్ వర్మ( 22 బంతుల్లో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం పాకిస్థాన్ 6 వికెట్లకు 192 పరుగులే చేసి ఓటమిపాలైంది. హసన్ నవాజ్ (51 బంతుల్లో 96) పోరాడినా ఫలితం లేకపోయింది. దాంతో భారత్ వరుసగా రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


