విమర్శలు, ప్రశసంలను పట్టించుకోకు కొడుకా.. వీరేంద్ర సెహ్వాగ్ పుత్రోత్సాహం!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. తన పెద్ద కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవలే భారత అండర్ 19 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తండ్రి తరహాలోనే ఆర్యవీర్ సెహ్వాగ్ డాషింగ్ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో సొంతగడ్డపై జరిగిన మూడు యూత్ వన్డేల సిరీస్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
తొలి మ్యాచ్‌లో 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. రెండో మ్యాచ్‌లో 48 బంతుల్లో 9 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. మూడు పరుగుల దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక మూడో వన్డేలో ఆర్యవీర్ సెహ్వాగ్ 31 బంతుల్లో 5 ఫోర్లు బాది 34 పరుగులు రాబట్టాడు. తద్వారా మొత్తంగా ఈ సిరీస్‌లో 109 పరుగులు చేశాడు. ఈ మూడు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ అండర్ 19 టీమ్ గెలుచుకుంది.
విమర్శిస్తారు.. ద్వేషిస్తారు..
తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ తన కొడుకు ప్రదర్శన గురించి మాట్లాడాడు. అతనికి తాను ఇచ్చే సలహాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. 'ఆర్యవీర్ సెహ్వాగ్‌ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. స్వేచ్ఛగా ఆడాలని నా కొడుక్కి సలహా ఇచ్చాను. 'మైదానంలో నిన్ను నువ్వు ఆవిష్కరించుకో. భారీ స్కోర్లు సాధించాలనే ఆలోచన పక్కన పెట్టి ఆటను ఆస్వాదించు.

నువ్వు స్వేచ్ఛగా ఆడితే పరుగులు వాటంతటవే వస్తాయి. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. ఒక్కోసారి ఘాటుగా విమర్శిస్తారు. ఇంకొన్నిసార్లు బాగా ద్వేషిస్తారు. కానీ వీటిలో ఏ ఒక్కదానికి కూడా నువ్వు రియాక్ట్ కావద్దు. ఆటను ఆస్వాదిస్తూ లక్ష్యాలను అందుకోవడమే నీ పని. నువ్వు బాగా ఆడుతున్నావా? విఫలమవుతున్నావా? అనే విషయం నీకే అర్థమవుతుంది.
ఇంకా పిల్లాడే.. నేర్చుకుంటాడు
అలాంటి సమయాల్లో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టు. బయటి వ్యక్తులు ఏమంటున్నారనే దానికంటే ప్రాక్టీస్ చేయడంపైనే నీ ఫోకస్ ఉండాలి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కేవలం ఆట మీదనే దృష్టి పెట్టాలి.'అని సలహా ఇచ్చాను. అందుకు ఆర్యవీర్ కూడా సరే అన్నాడు. ఢిల్లీ తరఫున అండర్ 19 క్రికెట్ ఆడాడు. పరుగులు చేశాడు. ఒక్కోసారి విఫలమయ్యాడు.
ఏ దశలోనైనా నా కొడుకు ఒకేలా ఉన్నాడు. అదే గొప్ప విషయం. అయినా తను ఇంకా చిన్నపిల్లాడే. కాబట్టి ఒక్కోసారి నిరాశకు గురై బాధపడుతుంటాడు. 18 ఏళ్ల పిల్లాడు మెల్లగా అన్నీ నేర్చుకుంటాడు.'అని వీరేంద్ర సెహ్వాగ్ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


