కోహ్లీ X కుంబ్లే గొడవ వల్లే కోచ్ పదవికి దరఖాస్తు చేశా: వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అనంతరం ఆ బాధ్యతలు చేపట్టేందుకు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తి కనబర్చాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తడంతో అతని కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించలేదు. కొత్త కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సెహ్వాగ్ రేసులోకి వచ్చాడు.
హెడ్ కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రవి శాస్త్రికి ఈ పదవి వరించగా.. సెహ్వాగ్‌కు మొండి చెయ్యి ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై సెహ్వాగ్ స్పందించాడు. తాను దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

కోహ్లీ కోరడంతోనే..
అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి, విరాట్ కోహ్లీ కోరిక మేరకే తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నానని సెహ్వాగ్ తెలిపాడు. 'విరాట్ కోహ్లీ గానీ, అప్పటి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి గానీ నన్ను సంప్రదించి ఉండకపోతే.. నేను అసలు కోచ్ పదవికి దరఖాస్తు కూడా చేసి ఉండేవాడిని కాదు. అమితాబ్ చౌదరి నాతో ప్రత్యేకంగా సమావేశమై.. అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
నేను కోరిన సపోర్ట్ స్టాఫ్ ఇవ్వకపోవడంతో..
2017 ఛాంపియన్స్ ట్రోఫీతో అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఆ టోర్నీకి నువ్వు కామెంటేటర్‌గా ఉన్నావు కదా? అక్కడి నుంచి హెడ్ కోచ్‌గా జట్టును వెస్టిండీస్‌కు తీసుకెళ్లవచ్చని ఆయన నాతో అన్నారు. దానికి నేను అవునని గానీ, కాదని గానీ చెప్పలేదు. కానీ నేను కోచ్‌గా ఎంపికైతే నా సిబ్బంది నాకు కావాలని కోరాను. సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, ట్రైనర్, ఇలా నా ఇష్టప్రకారం అందరూ నాకు కావాలి అన్నాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు, అందుకే నేను కోచ్‌గా బాధ్యత చేపట్టలేదు.'అని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
కోహ్లీ, కుంబ్లే గొడవ..
కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆటగాళ్ల పట్ల అనిల్ కుంబ్లే కఠినంగా వ్యవహరిస్తున్నాడని, అతని కోచింగ్ స్టైల్ జట్టులోని ఆటగాళ్లకు నచ్చడం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆటగాళ్లంతా ఒక్కటై కుంబ్లేపై బీసీసీఐ ఫిర్యాదు చేశారని, దాంతోనే అతన్ని కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్.. ఫైనల్లో పాక్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

