అదే నా ఏకైక లక్ష్యం.. ఎంతకైనా తెగిస్తా: విరాట్ కోహ్లీ
2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ లక్ష్యాన్ని అందుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరి మెగా టోర్నీ అని చెప్పిన విరాట్ కోహ్లీ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన కోహ్లీ.. ప్రపంచకప్ ప్రణాళికలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చాలా భిన్నమైనదని, శారీరకంగా, మానసికంగా ఆటగాళ్లకు సవాల్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.
ఇదే నా చివరి ప్రపంచకప్..
'వన్డే ప్రపంచకప్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. టీ20 స్థాయిలో ఉండే తీవ్రతతో పోల్చితే వన్డేల్లో ఒకే రోజు రెండున్నర టీ20 మ్యాచ్‌లు ఆడినట్లు ఉంటుంది. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీల్లో వరుసగా 10 మ్యాచ్‌ల పాటు ఆ తీవ్రతను కొనసాగించడం చాలా పెద్ద విషయం. అంతేకాకుండా ఈ మెగా టోర్నీ విదేశీ పరిస్థితుల్లో జరుగుతోంది. కాబట్టి ఈ టోర్నీ శారీరకంగా, మానసికంగా.. ఆటగాళ్లను పిండేస్తుంది.

నా విషయానికి వస్తే.. భారత్ తరఫున నేను ఆడే చివరి ప్రపంచకప్ ఇది. అదే నాకు పెద్ద మోటివేషన్. నా శక్తినంతా మైదానంలోనే పెట్టేయాలనుకుంటున్నాను. కచ్చితంగా ప్రపంచ కప్ గెలవడమే నా ఏకైక లక్ష్యం. దాని కోసం ఏది చేయడానికైనా నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఎంతకైనా తెగిస్తాను.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ విజయంతో అంతర్జాతీయ క్రికెట‌్‌కు వీడ్కోలు పలుకుతాననే హింట్ ఇచ్చాడు.
స్వేచ్ఛగా ఆడుతా..
గతంలో కంటే తాను మరింత స్వేచ్ఛగా ఆడుతానని చెప్పాడు. తనపై ఉండే అంచనాలను అస్సలు పట్టించుకోనని చెప్పాడు. ఇన్నాళ్లు పరిస్థితులను స్థిరీకరించడమే తన పాత్రగా ఉండేదన్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడే సత్తా తనకు ఉన్నా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడే బాధ్యతను తనకు ఇచ్చారని గుర్తు చేశాడు.
మొదటి నుంచే దూకుడుగా ఆడటం కంటే.. క్రీజులో కుదురుకున్న తర్వాత దూకుడు ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా నేర్చుకుంటున్నాడని, ఇంకా అతను యువకుడేనని కోహ్లీ తెలిపాడు. కానీ భారత జట్టును నడిపించే సరైన దృక్పథం, తీవ్రత అతనిలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
గిల్‌కు స్పష్టమైన ప్రణాళికలున్నాయి..
'మైదానంలో జట్టు ఎలా ఆడాలనే విషయంలో శుభ్‌మన్ గిల్‌కి చాలా స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. సహజంగానే అనుభవం పెరిగే కొద్దీ, మ్యాచ్ పరిస్థితులపై అవగాహన వచ్చే కొద్దీ తీసుకునే నిర్ణయాలు మెరుగుపడతాయి. శుభ్‌మన్ గిల్ కూడా వాటిపై నిరంతరం వర్క్ చేస్తూ.. ఇంకా మెరుగవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కెప్టెన్సీ చేసే ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారు'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ టెస్ట్‌లతో పాటు టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత 10 వన్డేల్లో విరాట్ కోహ్లీ 3 శతకాలతో పాటు ఒక 90 ప్లస్ ఇన్నింగ్స్, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఒక్క ఫార్మాట్ ఆడటం వల్ల కోహ్లీ మరింత సౌకర్యంగా కనిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


