బౌలర్లు బావురుమంటున్నారు!
'ఇది క్రికెట్ కాదు.. కేవలం బ్యాటింగ్ మాత్రమే' నెలరోజుల క్రితం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన స్టేట్‌మెంట్. అతను అన్నట్లుగానే ఈ ఆధునిక క్రికెట్‌లో పూర్తిగా బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. గురువారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ 430 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది.
ఒకప్పుడు వన్డేల్లో 250 పరుగులు చేస్తేనే గొప్పగా ఉండేది. కానీ ఆ తర్వాత అది 300, 350కి చేరింది. ఇప్పుడైతే 400 పరుగులు చేసినా విజయంపై గ్యారెంటీ లేదు. ఒకప్పుడు వెస్టిండీస్ దిగ్గజ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, మెల్కమ్ మార్షల్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు బంతిని కనీసం టచ్ కూడా చేయలేకపోయేవారు. ఈ ఆరవీర భయంకరమైన బౌలర్లను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు వణికిపోయేవారు.
బౌలర్లకు రక్త కన్నీరే..
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతటి డేంజరస్ బౌలర్ అయినా బ్యాటర్‌కు బలవ్వాల్సిందే. ఆటలో తెచ్చిన మార్పులు.. కమర్షియల్ సక్సెస్ కోసం బ్రాడ్‌కాస్టర్ల ఒత్తిడితో బ్యాటింగ్ పిచ్‌లు సిద్దం చేయడం బౌలర్లకు శాపంగా మారింది. ప్రేక్షకులు కూడా ధనాధన్ బ్యాటింగ్‌ను ఇష్టపడటంతో క్రికెట్ బోర్డులు అభ్యంతరం చెప్పడం లేదు. దాంతో బౌలర్లు కొట్టించుకోలేక బావురుమంటున్నారు.

క్రికెట్‌ను శాసించే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ ఏ దేశంలోనైనా బ్యాటర్లదే హవా నడుస్తోంది. ఎక్కడా చూసినా భారీ స్కోర్లే నమోదవుతున్నాయి. ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ ధనాధన్ ఆటకే అలవాటు పడ్డారు. ఏదైనా మ్యాచ్ కాస్త స్లోగా సాగితే చూడలేకపోతున్నారు. దాంతో బ్రాడ్‌కాస్టర్లు బ్యాటింగ్ పిచ్‌లనే సిద్దం చేయాలని ఆయా క్రికెట్ బోర్డులపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో బౌలర్లకు రక్త కన్నీరే మిగులుతోంది.
తేలిపోయిన భువీ..
న్యూజిలాండ్ పర్యటనలోనూ భారత్ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. డ్యూ ప్రభావంతో పాటు పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో బౌలర్లు తేలిపోయారు. ఈ తరహా మ్యాచ్‌ల్లో బౌలర్లే విలన్లుగా మారుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పిచ్ నుంచి సహకారం లభించడంతో తొలి ఓవర్‌లో కట్టడిగా బౌలింగ్ చేసిన అతను.. తర్వాత పరిస్థితులు మారిపోవడంతో మూడు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
స్లో ఓవర్ రేట్ శిక్ష కూడా బౌలర్లకే..
స్లో ఓవర్ రేట్ శిక్ష కూడా బౌలర్లపైనే పడుతోంది. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పవర్ ప్లే అనంతరం సర్కిల్ బయట గరిష్టంగా ఐదుగురు ఫీల్డర్లకు అవకాశం ఉంటుంది. కానీ నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయకపోతే స్లో ఓవర్ రేట్ పెనాల్టీ ప్రకారం.. ఒక ఫీల్డర్‌ను సర్కిల్ లోపల పెట్టాల్సి ఉంటుంది. ఇది బౌలర్లకు శాపంగా మారింది. అసలే డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే బ్యాటర్లు.. సర్కిల్ బయట ఫీల్డర్లు తక్కువ ఉండటంతో మరింత ధాటిగా చెలరేగుతున్నారు.
బ్యాట్‌కు బంతికి మధ్య పోటీ ఉండేలా
ఈ క్రమంలో బ్యాట్‌కు బంతికి మధ్య పోటీ ఉండేలా పిచ్‌లు సిద్దం చేయాలని క్రికెట్ ప్రేమికులు సూచిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు చాలా రోజుల నుంచి బౌలర్ల ప్రాధాన్యత పెరిగేలా ఆటలో మార్పులు తేవాలని ఐసీసీని కోరుతున్నారు.
క్రికెట్ అభిమానులు కూడా ఏకపక్ష మ్యాచ్‌లతో విసిగిపోతున్నామని, భారీ స్కోర్లు నమోదైనా హోరా హోరీగా సాగితేనే అసలు మజా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మా మైఖేల్ ప్రతినిధి పలువురు అభిమానులను పలకరించగా.. మేజార్టీ ఫ్యాన్స్ బ్యాట్‌కు బంతికి మధ్య సమానమైన పోటీ ఉండేలా పిచ్‌లు సిద్దం చేయాలన్నారు.
'పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లతో బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా పిచ్‌ల కారణంగా బౌలర్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. మ్యాచ్‌లపై ఆసక్తి కూడా తగ్గుతోంది. భారీ స్కోర్లతో మ్యాచ్‌లు పూర్తిగా ఏకపక్షంగా సాగుతున్నాయి. బౌలర్లకు అనుకూలంగా ఆటలో మార్పులు చేయాలి. అప్పుడే క్రికెట్ వైభవం కోల్పోదు.'- శ్రీధర్ రెడ్డి, క్రికెట్ అభిమాని.
'భారీ స్కోర్లతో మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయి. దాంతో ఆటపై ఆసక్తి తగ్గుతోంది. ఒకప్పుడు బ్యాట్‌కు బంతికి మధ్య మంచి పోటీ ఉండేది. కానీ ఇప్పటి మ్యాచ్‌లు అలా లేవు. బౌలర్లను దృష్టిలో పెట్టుకొని ఆటలో మార్పులు తేవాలి.'- స్వామి, నైంటీస్ క్రికెట్ అభిమాని.
'ఈ ఆధునిక క్రికెట్‌లో ఎంత పెద్ద స్కోర్ అయినా సేఫ్ కాదు. అది వన్డే అయినా టీ20 అయినా.. భారీ లక్ష్యం నమోదు చేశామని హాయిగా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఛేజింగ్ టీమ్ ఈజీగా గెలుస్తుంది. ఫ్లాట్ పిచ్‌లతో బ్రాడ్‌కాస్టర్, ఆర్గనైజర్స్ సంతోషంగా ఉన్నా.. అభిమానులకు మొహం కొట్టేస్తోంది. ఇది ఏ మాత్రం సరికాదు. '-వెంకటేశ్, క్రికెట్ అనలిస్ట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


