IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన
బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే జింబాబ్వేపై విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన స్మృతి మంధాన బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించింది. అయితే ఈ మ్యాచ్‌తో విజయం సాధించినా తమ ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్లు లేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా క్యాచ్‌లు అందుకునే విషయంలో తమ జట్టు చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.
మా బౌలర్లు అద్భుతం..
'ఈ మ్యాచ్ అద్భుతంగా సాగింది. మా బౌలర్లు సరైన లైన్ లెండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే మా ప్రదర్శన చాలా మెరుగైంది. దీప్తి శర్మ, శ్రీ చరణి, నిక్కీ ప్రసాద్ కీలక వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ గెలిచినా మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్లు లేదు. ముఖ్యంగా క్యాచ్‌లు వదిలేసే విషయంలో మేం మెరుగవ్వాల్సి ఉంది.

గత మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ చూశాక కొన్ని ప్రణాళికలు రచించాం. ఫుల్లర్ లెంగ్త్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రణాళికలను మా బౌలర్లు అద్భుతంగా అమలు చేశారు. షెఫాలీ వర్మ తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడుతుంటే.. నేను సింగిల్స్ తీస్తూ ఆమెకు సపోర్ట్ చేశాను. నాకు అవకాశం లభించినప్పుడు షాట్స్ ఆడాను. మేం ఆడాలనుకుంటున్న అసలైన ఆటతీరు ఇదే.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
షెఫాలీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 102 పరుగులు చేసింది. చిపో ముగేరి-ట్రిపానో(32 బంతుల్లో 5 ఫోర్లతో 34), కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (35 బంతుల్లో 2 ఫోర్లతో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో నికీ ప్రసాద్(2/7) రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, నందని శర్మ, దీప్తి శరర్మ, శ్రీ చరణి తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి గెలుపొందింది. షెఫాలీ వర్మ(25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


