ఆ 5 సిక్సర్లతోనే గుర్తించకండి..నాకు కెప్టెన్సీ చేసే సత్తా ఉంది: రింకూ సింగ్
ఐపీఎల్‌లో వరుసగా కొట్టిన ఐదు సిక్సర్లతోనే తనను గుర్తించవద్దని టీమిండియా టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ అభిమానులను కోరాడు. తాను భారత ఆల్-ఫార్మాట్ ఆటగాడిగా ఎదుగాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్సీ చేసే సత్తా కూడా తనకు ఉందని చెప్పాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి ఐదు బంతులను రింకూ సింగ్ సిక్సర్లుగా తరలించాడు. దాంతో ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఈ మ్యాచ్ ఐకానిక్‌గా నిలిచిపోయింది. రింకూ సింగ్‌కు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. టీమిండియాలో ఆడే అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టింది. దాంతో రింకూ సింగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అంతా ఈ ఐదు సిక్సర్ల గురించే చర్చిస్తారు.
నేనంటే.. ఆ ఐదు సిక్సర్లే కాదు..
అయితే తనను ఈ ఐదు సిక్సర్లకే పరిమితం చేయవద్దని రింకూ సింగ్ తాజాగా అభిమానులను కోరాడు. భారత్ తరఫున ప్రపంచకప్ గెలవడంలో భాగస్వామి కావడమే ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాపై టీ20 ఆటగాడనే ముద్ర వేయడం సరికాదు. నేను వన్డేలతో పాటు టెస్ట్ ఫార్మాట్ ఆడగలను. దేశవాళీ క్రికెట్‌లో వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతున్నాను. భారత్ తరఫున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయాలన్నదే నా కల.

ప్రస్తుతం భారత్ తరఫున ఒక్క ఫార్మాట్‌లో ఆడుతున్నా.. మూడు ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదగాలనుకుంటున్నాను. మూడు ఫార్మాట్లలోనూ రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక నన్ను కేవలం ఐదు సిక్సర్లతోనే గుర్తించకూడదు. భారత్‌కు ప్రపంచకప్ అందించాలనేదే నా ప్రధాన లక్ష్యం. బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడుతూ.. మరిన్ని ప్రపంచకప్ విజయాల్లో భాగం కావాలని కోరుకుంటున్నాను.'అని రింకూ సింగ్ తెలిపాడు.
కెప్టెన్సీ సత్తా ఉంది..
ఇక కెప్టెన్సీపై కూడా రింకూ స్పందించాడు. యూపీ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ కూడా గెలిచానని గుర్తుచేశాడు. 'గత సీజన్‌లో ఐపీఎల్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. అజింక్య రహానె, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. కెప్టెన్సీలో ఇంకా ఎదగాల్సి ఉంది.'అని చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని దేశం మొత్తం కోరుకుంటోందని రింకూ సింగ్ తెలిపాడు. ఈ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లని చెప్పిన రింకూ సింగ్.. 2027 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిస్తే అది దేశానికే కాకుండా కోహ్లీ, రోహిత్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైన సందర్భమవుతుందని చెప్పాడు.
యావత్ దేశం కోరుకుంటుంది..
'కోహ్లీ భయ్యా, రోహిత్ భయ్యా ఇద్దరూ లెజెండ్స్. వాళ్లు ప్రపంచకప్‌లో ఆడాలని నేను ఒక్కడినే కాదు.. దేశం మొత్తం కోరుకుంటోంది. వాళ్లు జట్టులో ఉండి భారత్‌ను ప్రపంచకప్ విజేతగా నిలిపితే ఎంతో గొప్పగా ఉంటుంది. అది వాళ్లకు చివరి ప్రపంచకప్ కావచ్చేమో. 2011 తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలవలేదు. అందుకే వాళ్లిద్దరూ జట్టుతో ఉండి ట్రోఫీ గెలిస్తే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


