గంభీర్.. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఆ తప్పులు చేయొద్దు: యువరాజ్ సింగ్
టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో తరుచూ మార్పులు చేయవద్దని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సూచించాడు. 20 మంది ఆటగాళ్లతో ఒక కోర్ జట్టును సిద్దం చేసి వారిపై నమ్మకం ఉంచాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సలహా ఇచ్చాడు.
దీర్ఘ కాలిక ప్రణాళికతో ముందుకు సాగితేనే ఆశించిన ఫలితం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చివరి నిమిషాల్లో మార్పులు చేయవద్దు..
'భారత జట్టు మెగా టోర్నీల్లో విఫలమైన ప్రతీసారి, దానికి ప్రధాన కారణం ఆఖరి నిమిషంలో చేసిన భారీ మార్పులే. కాబట్టి 2027 ప్రపంచకప్ గెలవగలదని మనం నమ్మే జట్టును ఎంచుకొని, టోర్నీ వరకు వారికే అండగా నిలవడం చాలా ముఖ్యం. వారు రాణించినా.. విఫలమైనా జట్టుపై నమ్మకం ఉంచాలి. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో వన్డేల సంఖ్య తగ్గిపోయింది.

దాంతో ఆటగాళ్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం లేదు. కాబట్టి ఒక నిర్దిష్ట జట్టును ఎంచుకొని వారికే నిలకడగా అవకాశాలు కల్పించాలి. 16 నుంచి 20 మందితో కూడిన అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకుని, మైదానం, పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టులో ఒకటి రెండు మార్పులు చేయవచ్చు.'అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు తరహాలో..
ఆస్ట్రేలియా సాధించిన విజయాలను ఉదాహరణగా ప్రస్తావించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్‌లు గెలవడానికి ప్రధాన కారణం వారి జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉండటమే. క్లిష్ట పరిస్థితుల్లో ఏకమై ఆడే తత్వమే ఆసీస్‌ను విజేతగా నిలబెట్టింది. భారత్ కూడా ఇలాంటి మనస్తత్వాన్నే అలవర్చుకోవాలి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లను గుర్తించి, వారిని ప్రోత్సహించాలి.
ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. స్థిరమైన జట్టుతో బరిలోకి దిగడం వల్లే విజయం సాధ్యమైంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగాలి.'అని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు యువరాజ్ సింగ్ సలహా ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


