బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ ఒక ఆసక్తికరమైన రైవల్రీగా మారింది.బ్యాటింగ్ బలం మెండుగా ఉన్న ఈ రెండు జట్లు తలపడ్డాయంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే.ఇప్పటివరకు జరిగిన పోరులో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలవడం ఈ పోటీలోని అసలు మజాను తెలియజేస్తోంది.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ అత్యధికంగా 206 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది.దీనికి ధీటుగా గుజరాత్ టైటాన్స్ కూడా 200 పరుగుల మార్కును అందుకుని తమ సత్తా చాటింది.ఇరు జట్లలోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లో ఉంటే స్టేడియంలో సిక్సర్ల వర్షం ఖాయమని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ రైవల్రీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు.గుజరాత్ టైటాన్స్‌పై కోహ్లీ ఇప్పటివరకు 344 పరుగులు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.ఇందులో ఒక అద్భుతమైన అజేయ సెంచరీ కూడా ఉంది.కోహ్లీతో పాటు ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో ఈ మ్యాచ్‌ల ఫలితాలను శాసిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచారు. రెండు ఫ్రాంఛైజీల తరపున ఆడిన అనుభవం సిరాజ్‌కు ఉన్నందున ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌కు బంతులు ఎలా సంధించాలో తనకు మంచి ఐడియా ఉంటుంది.దీంతో పవర్ ప్లేలోనే బెంగళూరు జట్టు కీలక వికెట్లు తీసి కట్టడి చేయాలని భావిస్తున్నాడు.గుజరాత్ వైపు నుండి రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ , జోషువా లిటిల్ వంటి బౌలర్లు తమ స్పిన్ మరియు వేగంతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి మ్యాచ్ మలుపు తిప్పగలిగే సత్తా ఉన్నవారే.
ఈ రెండు జట్ల మధ్య పోరులో ఎవరు గొప్ప అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. 2024 సీజన్‌లో ఆర్‌సీబీ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి ఆధిపత్యం ప్రదర్శించగా, 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి లెక్క సరిచేసింది. ప్రస్తుతం ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డు 3-3 తో సమంగా ఉంది. దీనివల్ల ఏ జట్టు కూడా మరొకరిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు.
ఇక ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడబోయే నేటి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ రైవల్రీలో ఆధిక్యాన్ని సంపాదిస్తుంది. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ మెరుపులు, గిల్ క్లాసిక్ షాట్లు, సిరాజ్ పదునైన బంతులు.. ఇలా అన్ని రకాలుగా ఈ పోరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. మరి 2026లో ఏ 'టైటాన్' గెలుస్తుందో, ఏ 'ఛాలెంజర్' సత్తా చాటుతాడో వేచి చూడాలి.