హమయ్యా రెండో రౌండ్‌కు వెళ్తోంది.. పాక్‌పై భారత మాజీ క్రికెటర్ సెటైర్స్
వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 7న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. గత ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ రిపీట్ కానుంది. ఈ మ్యాచ్ అనంతరం మూడు రోజులకు జోహన్నెబర్గ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
భారత్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, జింబాబ్వేతో పాటు క్వాలిఫయర్స్ నుంచి వచ్చే మరో అసోసియేట్ దేశం గ్రూప్-ఏలో ఉన్నాయి. ప్రతీ గ్రూప్‌లో టాప్-3లో నిలిచే జట్లు సూపర్ 7కు అర్హత సాధిస్తాయి. ఇరు జట్లలో నాలుగో స్థానంలో నిలిచే జట్ల మధ్య టాప్‌లో నిలిచిన టీమ్‌కు ఏడో బెర్త్ దక్కుతుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరిగే సూపర్ 7 దశలో ప్రతీ టీమ్ అదనంగా 6 మ్యాచ్‌లు ఆడుతుంది. సూపర్ 7 దశలోని టాప్ -4 టీమ్స్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

సంతోషంలో పాకిస్థాన్..
ఈ షెడ్యూల్ ప్రకటన సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ పాకిస్థాన్ టీమ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ షెడ్యూల్ పట్ల పాకిస్థాన్ సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్ సూపర్-7 బెర్త్ టార్గెట్‌గా పెట్టుకుందని సెటైర్లు పేల్చాడు.
'వన్డే ప్రపంచకప్ ఆడే జట్లు తమ మైండ్‌సెట్‌కు తగ్గట్లు విభిన్నంగా ఆలోచిస్తాయి. తాము కనీసం సెమీఫైనల్స్‌కైనా చేరుకుంటామని భారత్ భావిస్తూ ఉంటుంది. మరోవైపు.. ఈ షెడ్యూల్‌ను చూసిన తర్వాత 'మేం కచ్చితంగా సూపర్ 7 దశకు చేరుకుంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని పాకిస్థాన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ షెడ్యూల్‌ను చూసి పాకిస్థాన్ సంతోషంగా ఉండాలి. తాము రెండో రౌండ్‌కు చేరుకుంటామని వారు భావిస్తూ ఉండాలి.'అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మూడో టైటిల్ కోసం..
1983 ప్రపంచకప్‌ను కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి గెలిచిన భారత్.. 2011లో సొంతగడ్డపై ధోనీ సారథ్యంలో ఈ ప్రతిష్మాత్మక ట్రోఫీని గెలిచింది. ముచ్చటగా మూడో సారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎడిషన్ 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా సౌతాఫ్రికాలో ప్రపంచకప్ 2003 జరిగినప్పుడు భారత్ రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ఓటమిపాలైంది.
టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచకప్ గెలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఉన్నారు. భారత ఆటగాళ్లు ఈ టోర్నీ గెలిచి రోహిత్, కోహ్లీలకు ఘన వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


