భువీ ఎంపిక అద్భుతం.. షమీని కూడా తీసుకోవాలి: మాజీ చీఫ్ సెలెక్టర్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ ఛీప్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్వాగతించాడు. ఐపీఎల్‌లో గత మూడు- నాలుగు సీజన్లలో 72 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ఇందుకు అర్హుడని అభిప్రాయపడ్డాడు. అతను వన్డేల్లోకి రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అనేది తాను ఇప్పుడే చెప్పలేనన్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న మరో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని వన్డే, టెస్ట్‌ల్లోకి పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెస్కే ప్రసాద్ సూచించాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి భువనేశ్వర్ కుమార్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. 2022లో న్యూజిలాండ్‌పైనే చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ అదే జట్టుపై పునరాగమనం చేయనున్నాడు.
భువీ ఎంపిక అద్భుతం..
టీ20 సిరీస్‌లో సత్తా చాటితే భువనేశ్వర్ కుమార్‌కు వన్డేల్లో కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఈ సెలెక్షన్‌పై తాజాగా మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. సెలెక్టర్ల నిర్ణయాన్ని కొనియాడాడు. అజిత్ అగార్కర్ తప్పుకోవడంతోనే భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం దక్కిందా? అంటే అది తనకు తెలియదని బదులిచ్చాడు.

'భువనేశ్వర్ కుమార్ ఎంపిక అద్భుతం. ఎందుకంటే గత మూడు-నాలుగు ఐపీఎల్ సీజన్లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి ఈ సెలెక్షన్‌కు అతను పూర్తి అర్హుడు. భువనేశ్వర్ కుమార్ వన్డేల్లో ఆడటం గురించి నాకైతే తెలియదు. కానీ టీ20 ఫార్మాట్‌లో మాత్రం అతను కొనసాగుతాడు. అతనికున్న క్లాస్, ప్రతిభ చూస్తుంటే ఇప్పటికీ టీ20లు ఆడే సత్తా అతనికి ఉంది.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
షమీకి మరో అవకాశం ఇవ్వాలి..
షమీ పునరాగమనం గురించి మాట్లాడుతూ.. అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెస్కే ప్రసాద్ సెలెక్టర్లను కోరాడు. 'ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా భారత జట్టులో షమీ భవిష్యత్తుపై కాస్త అనిశ్చితి నెలకొంది. అయితే 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతనికి ఉన్న అద్భుతమైన రికార్డు, ఇప్పటికీ అతను చూపిస్తున్న ఫామ్ దృష్ట్యా షమీకి మరో అవకాశం ఇవ్వాలి.
అతన్ని నేను న్యూజిలాండ్ సిరీస్‌లో చూడాలని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కూడా అతను ఆడితే బాగుంటుంది. కీలకమైన సిరీస్‌లు దగ్గరపడే వరకు ఆగి, అప్పుడు సీనియర్ ఆటగాళ్లను పరీక్షించడం సరికాదు. వారిని ఆడించాలనుకుంటే ఇప్పటి నుంచే అవకాశాలు ఇవ్వాలి.'అని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం షమీకి తన ఫిట్‌నెస్, బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి రంజీ ట్రోఫీనే మంచి అవకాశం. షమీకి అవకాశం లభిస్తుందా? లేదా? అనేది న్యూజిలాండ్ పర్యటనకు సెలెక్టర్లు ప్రకటించే వన్డే, టెస్ట్ టీమ్‌లతో స్పష్టమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


