సంక్షోభంలో పాక్ క్రికెట్.. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు!
పాకిస్థాన్ క్రికెట్ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ దేశ ఆటగాళ్లపై ఏకంగా ఫిక్సింగ్ ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ ఆఫ్ ఫీల్డ్ ప్రవర్తన అనుమానస్పదంగా ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి.
ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాజయాలతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో పీసీబీ కూడా కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. దాంతో పాకిస్థాన్ జట్టు అప్రతిష్టపాలై ఇంట బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
చిక్కుల్లో ఇమామ్, రిజ్వాన్..
అయితే ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ ఘోర పరాజయాలకు క్రికెటర్ల వైఫల్యంతో పాటు... ఫిక్సింగ్ కూడా ఓ కారణమని మీడియాలో కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వేటుకు గురైన ఏడుగురిలో రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ మొబైల్ డేటాను పీసీబీ స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతుందని పాక్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.

ఈ కథనం ప్రకారం.. పీసీబీ అధికారులు.. కేవలం ఆటగాళ్ల ప్రవర్తననే కాకుండా.. వారు సంప్రదించిన వ్యక్తులను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నప్పటికీ.. రిజ్వాన్, ఇమామ్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొబైల్స్ లాక్కున్న పీసీబీ..
ఇంగ్లండ్ పర్యటనకు రిజ్వాన్, ఇమామ్‌లను ఎంపిక చేయడంపై వివరణ కోరుతూ సెలెక్టర్లకు పీసీబీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మూడో టెస్ట్ ఆడే ఆటగాళ్ల నుంచి పీసీబీ మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్ వార్తా సంస్థ 365 న్యూస్ పేర్కొంది. మ్యాచ్ ముగిసే వరకు ఆటగాళ్లకు మొబైల్స్ ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లు రాసుకొచ్చింది. బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యం పాక్ బోర్డు విచారణకు ఆదేశించింది. ఆటగాళ్లపై క్రమశిక్షణపరంగా.. అంతర్గత విచారణ జరుపుతున్నామని సోమవారం పీసీబీ మీడియా ప్రతినిధి అమీర్ మీర్ వెల్లడించాడు. 'ఇంగ్లండ్ పర్యటనలో పాక్ ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తన గురించి మీడియాలో కథనాలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఈ విషయాలను అంతర్గతంగా సమీక్షిస్తాం. పీసీబీ ప్రమాణాలు, నియమనిబంధనల మేరకు విచారణ కొనసాగుతుంది.
ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను విశ్వసించవద్దని కోరుతున్నాం. ప్రస్తుతానికైతే పీసీబీ ఈ వ్యవహారంపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అభిమానులు, వాటాదారులు అందరూ పీసీబీ నుంచి అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి' అని అమిర్ మిర్ పేర్కొన్నాడు. కానీ ఆటగాళ్ల మొబైల్స్ లాక్కున్నారనే వార్తలపై అతను స్పందించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


