IND vs NZ: ఆ ఇద్దరితో పాటు మంచు ముంచింది: మిచెల్ సాంట్నర్
భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు మంచు తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ఈ ఇద్దర్ని కట్టడి చేయడంపై ప్రణాళికలను రచించాలని, లేకుంటే కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అభిషేక్ శర్మ(38 బంతుల్లో9 ఫోర్లు, 11 సిక్స్‌లతో 113), వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లేలోనే 118 పరుగులు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
భారత ఓపెనర్లను ఆపడం కష్టం..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. టాస్ ఓడిపోవడం, డ్యూ రావడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'భారత బ్యాటర్లకు మూమెంటమ్ లభిస్తే వారిని ఆపడం చాలా కష్టం. ఇలా దూకుడుగా ఆడటం గతంలోనే చూశాం. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడారు. ఈ రోజు న్యూజిలాండ్‌లో కూడా నేరుగా కళ్లారా ఆ విధ్వంసం చూశాం.

టాస్ ఓడిపోవడం కూడా మా విజయవకాశాలను దెబ్బతీసింది. అయినా డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్ అద్భుతంగా ఆడి జట్టుకు 200 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించారు. ఈ పిచ్‌పై 200 స్కోర్ మంచిదే. కానీ చివరి ఓవర్లలో భారత బౌలర్లు యార్కర్లతో మమ్మల్ని కట్టడి చేశారు. అయినప్పటికీ మేం చేసి స్కోర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాం.
మంచు ముంచింది..
పిచ్ బ్యాటింగ్‌కు బాగుందనే విషయం తెలుసు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు రావడంతో బౌలింగ్ చేయడం కష్టమైంది. ఈ రోజుల్లో పవర్ ప్లే ఎంతో ముఖ్యం. పవర్ ప్లేలో ఎలా ఆడాలో భారత ఓపెనర్లు చూపించారు.
ఈ సిరీస్‌లో ఓడినా మా బ్యాటర్లు మెరుగ్గానే రాణిస్తున్నారు. మొన్న గ్లేన్ ఫిలిప్స్ 80 పరుగులు చేస్తే నేడు డారిల్ మిచెల్ సత్తా చాటాడు. బ్యాటింగ్ యూనిట్‌కు ఎలాంటి డోకా లేదు. ఆటగాళ్లు బాధ్యత తీసుకొని ఆడటం జట్టుకు కలిసొచ్చే అంశం. భారత బౌలర్లపై ఎలా ఆడాలో మా బ్యాటర్లకు బాగా తెలుసు.
అందుకే ఆలస్యంగా బౌలింగ్ చేశా..
ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించే నేను ఆలస్యంగా బౌలింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్ చూసిన తర్వాత స్పిన్నర్లకు సపోర్ట్ లేదనే విషయం అర్థమైంది. పేసర్లకు కొంచె మూవ్‌మెంట్ లభించింది. అందకే ఎక్కువగా పేసర్లతో బౌలింగ్ చేయించాను. అయితే భారత ఓపెనర్లు ఇద్దరూ లెఫ్టాండర్లు కావడంతో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ప్రయోగించా. కానీ ఇది బెడిసి కొట్టింది. బ్రేస్‌వెల్‌ను భారత ఓపెనర్లు చితక్కొట్టారు.
భారత ఓపెనర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించా. కానీ ఏది వర్కౌట్ కాలేదు. వీలైనంత త్వరగా వాళ్లను ఆపే ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. లేదంటే కష్టమే. తదుపరి మ్యాచ్ జరిగే ఈడెన్ పార్క్ మైదానం ఇంకా చిన్నగా ఉంటుంది. కాబట్టి భారత బ్యాటర్లకు చెక్ పెట్టడానికి సరైన వ్యూహాలు రచించాల్సి ఉంది.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


