ఇషాన్ కిషన్.. ఇదేం తొండాట!
ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయం కోసం కాకుండా డ్రా కోసం ఆడటంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని, ఇలాంటి వ్యూహాలను ఆమోదించకూడదని అభిప్రాయపడుతున్నారు.
చెన్నై వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ విజయం ముంగిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్(270) డబుల్ సెంచరీతో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేసింది. అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో సౌత్ జోన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తారని అంతా అనుకున్నారు.

ఫాలో-ఆన్ ఆడించకుండా..
నిబంధనల ప్రకారం ఫాలో ఆన్ ఆడకూడదనుకుంటే.. ఇరు జట్ల మధ్య కనీసం 200 పరుగుల కంటే తక్కువ వ్యత్యాసం ఉండాలి. కానీ ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించినా.. ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్‌కు దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్(98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) దూకుడుగా ఆడగా.. శిఖర్ మోహన్(85 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ఈస్ట్ జోన్ ఆధిక్యం 584 పరుగులకు చేరింది. ఆఖరి రోజు సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఆలౌట్ చేసి విజయం కోసం ప్రయత్నిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి రోజు కూడా ఈస్ట్ జోన్ బ్యాటింగే కొనసాగించడం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఇదేం తొండాట..
తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో గెలిచినా.. డ్రా చేసుకున్నా ట్రోఫీ తమదేనని భావించిన ఈస్ట్ జోన్.. విజయం కోసం ప్రయత్నించకుండా డ్రా కోసం ఆడుతోంది. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని, గెలుపు కోసం ప్రయత్నించాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇషాన్ కిషన్ ఇదేం తొండాట అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
కొందరైతే.. ఫలితాన్ని తేల్చే రూల్స్ మార్చాలని డిమాండ్ చేసున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్‌లు డ్రా అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. ఈ రూల్‌తోనే ఈస్ట్ జోన్ రిస్క్ తీసుకోకుండా డ్రా కోసం ఆడుతుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల క్రికెట్ చూడాలనే మజా పోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


