IPL 2028: గంభీర్‌పై కన్నేసిన ఆ నాలుగు ఫ్రాంచైజీలు!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు గద్దల్లా కాచుకు కూర్చున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పదవి కాలం ముగియగానే తమ హెడ్ కోచ్‌గా లేదా మెంటార్‌గా నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పదవి కాలం 2027 వన్డే ప్రపంచకప్‌తో ముగియనుంది. అయితే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు అతని కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం ఉంది.
టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టకముందు గంభీర్.. కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. కేకేఆర్‌ను ఐపీఎల్ 2024 సీజన్‌లో విజేతగా నిలబెట్టాడు. ఈ విజయం నేపథ్యంలోనే గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్ పదవి దక్కింది. గంభీర్ పదవి కాలం ముగియడానికి మరో ఏడాది సమయం ఉండగానే.. ఫ్రాంచైజీలు అతన్ని నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని దైనిక్ జాగరన్ పేర్కొంది.

కేకేఆర్‌తో పాటు..
ఈ కథనం ప్రకారం.. గంభీర్‌ను కోచ్‌గా లేదా మెంటార్‌గా నియమించుకునేందుకు కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్‌తో పాటు మరో రెండు జట్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గంభీర్ పదవి కాలాన్ని పొడిగిస్తే ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను వాయిదా వేసుకోనున్నాయి. ఇప్పటికే గంభీర్ టీమ్‌తో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
ఈ రెండు జట్లతో పాటు ఐపీఎల్‌లోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన మరో టీమ్.. ఇప్పటి వరకు టైటిల్ గెలవని ఇంకో టీమ్.. గంభీర్‌ను తమ హెడ్ కోచ్‌గా నియమించుకునేందుకు పోటీపడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా టెస్ట్ క్రికెట్‌లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినప్పటికీ.. వైట్ బాల్ ఫార్మాట్లలో మాత్రం గంభీర్ అద్భుత విజయాలు అందించాడు. ఆసియా కప్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ 2026, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టును విజేతగా నిలబెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే లక్ష్యంగా జట్టును సిద్దం చేస్తున్నాడు.
మెంటార్‌గా మంచి అనుభవం..
ఐపీఎల్‌లో మెంటార్‌గా గంభీర్‌కు మంచి అనుభవం ఉంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌ను మెంటార్‌గా 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ పిలుపు మెరకు ఆ జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఏకంగా టైటిల్ అందించాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... కేకేఆర్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత గంభీర్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో కేకేఆర్ వరుస సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన కేకేఆర్, 2026 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచింది. లక్నో అయితే ఐపీఎల్ 2024, 2025 సీజన్‌లో 7వ స్థానంలో, 2026లో 10వ స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


