IND vs NZ: ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే భారత్ గెలిచేది!(వీడియో)
న్యూజిలాండ్ పర్యటనలో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్‌కు నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ అనూహ్య షాకిచ్చింది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఖాతా తెరిచి 3-1తో క్లీన్ స్వీప్‌ను తప్పించుకుంది.
చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్‌తో పాటు ఓ క్యాచ్ డ్రాప్ టీమిండియా పతనాన్ని శాసించింది. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే ఈ మ్యాచ్ ఫలితమే మరోలా ఉండేది. ఎందుకంటే వదిలేసిన క్యాచ్ ఎవరిదో కాదు. న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్‌ది. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నమన్ ధీర్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘోర తప్పిదం జరిగింది. ఈ ఓవర్ ఆఖరి బంతిని గ్లేన్ ఫిలిప్స్ తన స్టాన్స్ మార్చుకొని స్విచ్ హిట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. లాంగాఫ్ నుంచి ఈ క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన నమన్ ధీర్.. బంతిని అంచనా వేయలేక ముందుకొచ్చాడు. కానీ బంతి వెనక్కి పడటంతో ఎడమ చేతితో అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఈ క్యాచ్ డ్రాప్‌తో భారత్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్యాచ్ పట్టి ఉంటే గ్లేన్ ఫిలిప్స్ 57 పరుగులకే వెనుదిరిగేవాడు. మైఖేల్ బ్రేస్‌వెల్‌తో భారీ భాగస్వామ్యానికి కూడా తెరపడేది. కానీ ఈ అవకాశంతో గ్లేన్ ఫిలిప్స్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడి 46 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ముఖ్యంగా నితీష్ రెడ్డి బౌలింగ్‌లో వరుసగా 4 సిక్స్‌లు బాది 32 పరుగులు పిండుకున్నాడు. ఫిలిప్స్ క్యాచ్ పట్టి ఉంటే న్యూజిలాండ్.. 220 పరుగుల్లోపే కట్టడి అయ్యేది. అప్పుడు భారత్‌కు గెలిచే అవకాశం ఉండేది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడీ ఈ తప్పిదంతో మరోసారి రుజువైంది.
గ్లేన్ ఫిలిప్స్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(3/48) మూడు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్(1/49), అక్షర్ పటేల్(1/43), అర్ష్‌దీప్ సింగ్(1/38), నితీష్ కుమార్ రెడ్డి(1/64) చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35), నమన్ ధీర్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), అభిషేక్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(4/19) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/17), మాథ్యూ ఫిషర్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నేకు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


