IND vs WI: రఫ్ఫాడించిన కీమో పాల్.. ఉప్పల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి!
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా విఫలమైన టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ ఓటమి తెలుగు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.
శుభారంభం దక్కినా..
భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా 3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్‌ను కీమో పాల్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్.. అదే ఓవర్లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ షాట్స్ ఆడటంతో పవర్ ప్లేలోనే భారత్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం స్ప్రింగర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(16) ఔటవ్వగా.. తన శైలికి భిన్నంగా ఆడిన అభిషేక్ శర్మ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29)ను గుడకేష్ మోతీ ఔట్ చేశాడు. ఆ మరుసటి బంతికే నమన్ ధీర్(0) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పోరాడిన తిలక్, నితీష్..
ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి జట్టును ఆదుకున్నారు. తమదైన శైలిలో చెలరేగిన ఈ జోడీ.. ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించింది. హాఫ్ సెంచరీకి చేరువైన తిలక్ వర్మను రొమారియో షెఫెర్డ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఎండ్‌లో పోరాడిన నితీష్ కుమార్ రెడ్డి కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కీమో పాల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
దాంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఆ మరుసటి బంతికే ప్రిన్స్ యాదవ్(0)ను ఔట్ చేసిన కీమో పాల్.. ఆఖరి బంతికి అక్షర్ పటేల్‌ను పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


