IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!
న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్ అద్భుతమైన పోరాటం టీమిండియాకు విజయాన్ని అందించింది.
ఫిలిప్స్ పోరాటం వృథా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.

సంజూ, అభిషేక్ ఊచకోత..
226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్‌తో 3.1 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన సంజూ శాంసన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే అభిషేక్ శర్మ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 93 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హాఫ్ సెంచరీ అనంతరం భారీ షాట్స్ ఆడిన సంజూ.. అదే జోరులో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
7 పరుగులు 3 వికెట్లు..
ఆ మరుసటి ఓవర్‌లోనే తిలక్ వర్మ(6)ను మైఖేల్ బ్రెస్‌వెల్.. ఇషాన్ కిషన్(1)ను మిచెల్ సాంట్నర్ ఔట్ చేయడంతో టీమిండియా కష్టాల్లో పడింది. 7 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్(24)తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ 18 బంతుల్లో45 పరుగులు జోడించారు.
అక్షర్ వెనుదిరిగినా.. నమన్ ధీర్‌తో కలిసి అయ్యర్ చెలరేగాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఫిన్ అలెన్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ టీమిండియాకు కలిసొచ్చింది.
మలుపు తిప్పిన సాంట్నర్ ఓవర్
తర్వాతి రెండు ఓవర్లను కట్టడిగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ మిచెల్ సాంట్నర్ వేసిన 17 ఓవర్ మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పింది. ఈ ఓవర్‌లో నమన్ ధీర్ వరుసగా 6, 4 బాదగా.. శ్రేయస్ అయ్యర్ బౌండరీ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. దాంతో భారత్‌పై ఒత్తిడి తగ్గింది.
భారత్‌కు 12 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 43 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. అయ్యర్ ఔటైనా.. నమన్ ధీర్ నిలకడగా ఆడి భారీ సిక్సర్‌తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


