సంజూ శాంసన్‌ను ఏ లెక్కన ఆడించారు: మహమ్మద్ కైఫ్
గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో సంజూ శాంసన్‌ను ఏ లెక్కన ఆడించారని ప్రశ్నించాడు. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఎందుకు పక్కనపెట్టారని నిలదీసాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి బదులు సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించగా.. అతను తీవ్రంగా నిరాశపర్చాడు. 8 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. దాంతో మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదే విషయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. ఎక్కడ తప్పిదం చేస్తున్నానో వైభవ్ సూర్యవంశీ తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించాడు. 'నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వగా.. అతను మరోసారి నిరాశపర్చాడు. సాధారణంగా జట్టు నుంచి వేటుకు గురైనప్పుడు.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడి ఫామ్ అందుకుంటే తిరిగి జట్టులోకి తీసుకుంటారు. కానీ సంజూ శాంసన్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు.

అయినా అతనికి ఎందుకు అవకాశం ఇచ్చారు? అనేది అతిపెద్ద ప్రశ్న. జింబాబ్వే పర్యటనలో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా పరుగులు చేసిన తర్వాత కూడా అతన్ని పక్కనపెట్టారు. అదే ఓపెనింగ్ కాంబినేషన్‌తో ఎందుకు బరిలోకి దిగలేదు. అనేది మరో ప్రశ్న.
నా అభిప్రాయం ప్రకారం.. టీమిండియా మేనేజ్‌మెంట్ కాస్త సంకోచిస్తోంది. తమ ఉత్తమ ఓపెనింగ్ జోడీ గురించి వారికి ఇంకా క్లారిటీ లేదు. అందుకే వైభవ్ సూర్యవంశీ 'నేను ఎక్కడ తప్పు చేశాను'అని తనను తాను ప్రశ్నించుకుంటూ ఉండాలి.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
అభిషేక్ ఊచకోత..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/19) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 13.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(33 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 ) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


