ICC World Cup 2027 టికెట్లకు ఫుల్‌డిమాండ్.. భారత్ X పాక్ మ్యాచ్‌కు 83 లక్షల దరఖాస్తులు!
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ టికెట్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. 24 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి ఆఫ్రికా దేశాలు ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్ల కోసం 12 కోట్ల మంది ముందస్తు దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన గణంకా ప్రకారం.. 2026 నవంబర్ 1 నాటికి టికెట్ల కోసం మొత్తం 12,08,09,467 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ ప్రపంచకప్ టికెట్ బ్యాలెట్ కోసం 193 దేశాల నుంచి సుమారు 28 లక్షల మంది అభిమానులు రిజిస్టర్ చేసుకున్నారు. అంతేకాకుండా వేర్వేరు మ్యాచ్‌లకు సంబంధించి 3.25 కోట్లకుపైగా రిజిస్ట్రేషన్లు రావడం ఈ టోర్నీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది.
సౌతాఫ్రికా, యూకే, భారత్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా దేశాల నుంచే ఎక్కవమంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అఫ్రికా ఖండంలో కూడా ఈ టోర్నీకి క్రేజ్ బాగానే ఉంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా నుంచి 14.9 మిలియన్ అప్లికేషన్స్ వచ్చాయి.

భారత్-పాక్ మ్యాచ్‌కు అత్యధిక దరఖాస్తులు..
వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ మ్యాచ్ అయిన భారత్-పాక్ పోరుకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. 2027 అక్టోబర్ 10న జోహన్నస్‌బర్గ్ వేదికగా జరిగే ఈ దాయాదుల పోరు కోసం ఇప్పటికే 83, 97, 294 టికెట్ అప్లికేషన్స్ వచ్చాయి. 2027 నవంబర్ 21న జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వచ్చిన అప్లికేషన్స్ కంటే కూడా భారత్-పాక్ మ్యాచ్‌కు ఎక్కువ రావడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్‌కు 79,00,944 దరఖాస్తులు వచ్చాయి.
సౌతాఫ్రికాలోని 8 వేదికలు 41 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ 41 మ్యాచ్‌ల కోసం 105 మిలియన్ టికెట్ అప్లికేషన్స్ వచ్చాయి. ఆతిథ్య జట్టు ఆడే మ్యాచ్‌లకు 26 మిలియన్ మంది దరఖాస్తు చేసుకున్నారు. జింబాబ్వే మ్యాచ్‌లకు 13.3 మిలియన్ల దరఖాస్తులు రాగా.. 2027 అక్టోబర్ 24న భారత్‌తో జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కు 3.3 మిలియన్లకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి.
ఐసీసీ ఫుల్ హ్యాపీ
వన్డే ప్రపంచకప్ టికెట్లకు భారీ స్పందన రావడంపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. ఐసీసీ ఈవెంట్స్, క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గౌరవ్ సక్సెనా ఈ అనూహ్య స్పందనపై సంతోషం వ్యక్తం చేశాడు. రెండు దశాబ్దాల తర్వాత ఈ టోర్నీని ఆఫ్రికాకు తీసుకురావడం విశేషమని, ఈ స్థాయిలో డిమాండ్ ఉండటం చూస్తే టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుందని తెలిపాడు.
టికెట్ అప్లికేషన్స్‌కు చివరి తేది 2026 నవంబర్ 21 వరకు ఉంది. అభిమానులు tickets.cricketworldcup.com. ద్వారా తమకు నచ్చిన మ్యాచ్ టికెట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంతో ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరు ఒక మ్యాచ్ చొప్పున ఎన్ని మ్యాచ్‌లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్స్ నుంచి లాటరీ పద్దతి ద్వారా టికెట్లను కేటాయిస్తారు. ఎంపికైన విజేతలకు ఇమెయిల్ ద్వారా టికెట్లను ఎలా కొనుగోలు చేయాలనే వివరాలను పంపుతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


