ఆ తప్పిదంతోనే పాకిస్థాన్ చేతిలో ఓడిపోయాం: హ్యారీ బ్రూక్
బ్యాటింగ్ వైఫల్యంతోనే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఈ ఓటమికి తమ బౌలర్లను నిందించాల్సిన పనిలేదని, స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోయినా.. వాళ్లు అద్భుతంగా పోరాడారని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు.
షాదాబ్ ఖాన్ అజేయ శతకంతో..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 242 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓ దశలో 154/9 స్కోర్‌తో ఓటమి ముంగిట నిలిచింది. కానీ షాదాబ్ ఖాన్(96 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో 113 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో పాకిస్థాన్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. హ్యారీస్ రౌఫ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించాడు.
అంతకుముందు ఇంగ్లండ్ 46.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. బెన్ డకెట్(111 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీతో రాణించగా.. సామ్ కరణ్(52 బంతుల్లో 5 ఫోర్లతో 42), గస్ అట్కిన్సన్(28 బంతుల్లో 3 సిక్స్‌లతో 36 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(4/46) నాలుగు వికెట్లు తీయగా.. అర్ఫత్ మిన్‌హస్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.

బ్యాటర్ల వైఫల్యమే..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హ్యారీ బ్రూక్.. ఈ పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. 'ఈ ఓటమికి బౌలర్లను నిందించడం సరికాదు. బౌలింగ్‌లో మేం ఎలాంటి తప్పిదం చేయలేదు. మ్యాచ్ ఫలితం తేలేవరకు మా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. మేం బోర్డుపై తగినన్ని పరుగులు చేయకపోయినా..బౌలింగ్, ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. వారి నుంచి ఇంతకంటే ఎక్కవ నేను ఆశించలేను.
బ్యాటింగ్‌లో కూడా బెన్ డకెట్ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఈ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత సామ్ కరన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. కానీ అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాం. కానీ చివర్లో గస్ అట్కిన్సన్ అద్భుతమైన ఫినిషింగ్ అందించాడు. ఈ ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంకపై భారీ తేడాతో విజయం సాధిస్తేనే ఫైనల్ చేరుతాం. కాబట్టి ఆ జట్టును ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాం.'అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


